గత ప్రభుత్వాల హయాంలో దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ (Minister puvvada) అన్నారు. తెరాస సర్కారు మాత్రం దళిత జాతి అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. దేశ రాజకీయాల్లోనే సువర్ణ అధ్యాయం లిఖించే విధంగా అనేక సార్లు మేధోమథనం తర్వాత సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టారని వెల్లడించారు.
గ్రామాల్లో ఉండే దళితవాడల్లో దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్లను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. తెరాస ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత ఎంపవర్మెంట్ పథకం పట్ల దళిత సమాజం పెద్ద ఎత్తున హర్షిస్తుంది. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలను అన్ని రాజకీయ పార్టీలు ప్రశంసిస్తున్నాయి.
- పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి
దళిత జాతి అభివృద్ధికి తొలి మెట్టుగా ఈ పథకం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ముఖ్యమంత్రి మనసులో నుంచి పుట్టిన ఈ పథకం ద్వారా దళితులు స్వయం సమృద్ధి సాధించడంతోపాటు ఆత్మగౌరవంతో బతకుతారని ధీమా వ్యక్తం చేశారు.
గొప్ప మేధమథనం తర్వాత అమల్లోకి వచ్చిన పథకమే దళిత ఎంపవర్మెంట్ పథకం. ఎన్నికల తాత్కాళిక లాభం కోసం కాకుండా.. దళితులకు దీర్ఘకాలిక లాభం కలిగే విధంగా... స్వయం సమృద్ధి సాధించి.. ప్రభుత్వ పథకాల కోసం ఎదురుచూడకుండా చేయడం కోసం ఈ పథకం రూపకల్పన చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో రాజకీయాలకు తావు లేకుండా... లబ్ధిదారుడే స్కీంను ఎంపిక చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎవరైతే భూమిలేకుండా రెక్కల కష్టంమీద ఆధారపడి.. వ్యవసాయ కూలీగా జీవిస్తున్నారో వాళ్లకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
- సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్యే.
ఇదీ చూడండి: Minister Gangula:'అధికారంలో ఉండి చేయనిది.. ఇప్పుడెలా చేస్తారు'