ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాస నేతలు ప్రగతిభవన్ బాటపడుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆహ్వానం మేరకు ఈరోజు సాయంత్రం జరిగే సమావేశానికి ముఖ్య నేతలంతా పయనమయ్యారు. కేటీఆర్‌తో జరిగే సమావేశానికి జిల్లాకు చెందిన దాదాపు 50 మంది నేతలకు ఆహ్వానం అందింది. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు భేటీకి హాజరుకానున్నారు.
పువ్వాడకు బాధ్యతలు...
జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా పాల్గొనేలా మంత్రి పువ్వాడకు బాధ్యతలు అప్పగించారు. ఈ భేటీలో పాల్గొనాల్సిందిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం అందింది. చాలాకాలం తర్వాత జిల్లా గులాబీ నేతాగనమంతా ఒక్కచోట కలుసుకోవవడం ప్రాధాన్యం సంతరించుకోనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ...
ఈ భేటీలో ప్రధానంగా రానున్న శాసనమండలి ఎన్నికలపై చర్చించనున్నారు. మార్చిలో ఎన్నికలు జరుగుతాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కార్యాచరణపై జిల్లా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపైనా చర్చించనున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ పీఠం దక్కించుకునేందుకు చేపట్టాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు చేసే అవకాశం ఉంది. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌తో నేతల భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. నేతల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆసక్తిగా భేటీ...
ప్రధానంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెరాస వర్గాల్లో చర్చకు దారితీశాయి. పదవి ఎవరి సొత్తు కాదని.. కక్షపూరిత రాజకీయాలు చేయొద్దంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇవేకాకుండా నియోజకవర్గాల పర్యటనల్లోనూ నేతల మధ్య విబేధాలు పొడ చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలంటే పార్టీ నేతలంతా ఏకతాటిపై నడవాల్సిన ఆవశ్యకతను కేటీఆర్ వివరించే అవకాశాలున్నాయి.