KHAMMAM BRS PUBLIC MEETING SCHEDULE ఖమ్మంలో రేపు నిర్వహించే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనుందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు తెలిపారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సభా వేదికగా సమరభేరి మోగిస్తామని.. అంటున్నారు. దేశమంతటా తెలంగాణ విధానాల అమలే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ సభలో పలువురు జాతీయ నేతలు.. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సభకు సంబంధించిన వివరాలను మంత్రి హరీశ్‌రావు.. ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు. మంత్రిహరీశ్‌రావు మాట్లాడుతూ... '' ఈ ఖమ్మం సభ ఒక చరిత్రాత్మక సభ. ఇందులో నాలుగు జాతీయ పార్టీలు పాల్గొంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఇన్ని జాతీయ పార్టీలను, ఇంతమంది నాయకులను వేదికపై తీసుకువచ్చిన సందర్భమయితే లేదు. ఇదే మొదటి సారి. ఆప్ పార్టీ వ్యవస్థాపకులు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్, యూపీ సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ అధ్యక్షులు డీ. రాజా, సీపీఎం తరఫున ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొంటున్నారు. నాలుగు జాతీయ పార్టీలను ఒక వేదికై తీసుకురావడం.. కేసీఆర్ తొలి విజయం సాధించారు.'' అని తెలిపారు.
ఈ రోజు రాత్రికి జాతీయ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు హైదరాబాద్ చేరుకుంటారు. వారిని ప్రోటోకాల్ ప్రకారం.. మంత్రులు స్వాగతం పలకనున్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌కి హోంమంత్రి మహమూద్ అలీ స్వాగతం పలుకుతారు. వారి ప్రొటోకాల్ మొత్తం మంత్రి మహమూద్ అలీ పర్యవేక్షిస్తారు. కేరళ సీఎం పినరయి విజయన్‌కి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీపీఐ జాతీయ నేత డి.రాజాకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ స్వాగతం చెబుతారు.
ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్న జాతీయ స్థాయి నేతలంతా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్‌తో కలిసి అల్పాహారం తీసుకుంటారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌తో కలిసి... యాదాద్రికి వెళ్లి అక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు. లక్ష్మీనర్సింహ స్వామి దర్శనం అనంతరం... యాదాద్రి నుంచి రెండు హెలీకాప్టర్లలో ఖమ్మంకు బయలుదేరి వెళ్తారు.
నేరుగా సీఎం కేసీఆర్‌తో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్ చేరుకుంటారు. అక్కడ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత తెలంగాణలో చేపట్టే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడికి వచ్చిన ఆరుగురికి ఈ నేతలు అద్దాలు అందజేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది. ఆ తరువాత అదే హెలీక్యాప్టర్లలో జాతీయ స్థాయి నేతలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం వారి ప్రాంతాలకు జాతీయ నేతలు చేరుకుంటారు.
ఇవీ చూడండి: