ముందు జాగ్రత్త చర్యలు, అప్రమత్తతోనే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యం అవుతుందని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులు నమోదు చేసుకున్నారు. వీటితోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివాసిత ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు.
కరోనా వ్యాధి నివారణ కోసం అవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను పాటించాలని ప్రజలను కోరారు.