కరోనా వైరస్ ప్రభావం జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమను కుదేలు చేస్తోంది. ఇప్పటివరకు రూ.200 కోట్ల వ్యాపారం నిలిచిపోయింది. గ్రానైట్ క్వారీల్లో ముడి రాళ్లు కొనుగోలు చేసే బయ్యర్లు చైనా నుంచి ఖమ్మం వస్తుంటారు. రెండు నెలలుగా వాళ్లు రాకపోవడం వల్ల క్వారీల నుంచి వెలికి తీసే గ్రానైట్ ముడి రాళ్లు చైనాకు ఎగుమతి నిలిచిపోయింది.
పరిశ్రమలు ఇలా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 800 వరకు గ్రానైట్ పాలిష్ చేసే పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 50 వేల మంది వరకు పనిచేస్తుంటారు. నునుపుగా చేసిన గ్రానైట్ పలకలను రాజస్థాన్, గుజరాత్, దిల్లీ, ముంబయి, నాగ్‌పూర్, కర్ణాటక ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేసి లారీల్లో తరలిస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌తో పరిశ్రమ మూత పడింది.
- పూర్వ ఖమ్మం జిల్లాలోని 150కు పైగా గ్రానైట్ క్వారీల్లో వెలికితీసిన నాణ్యమైన ముడి రాళ్లను... చైనాకు ఎగుమతి చేస్తారు. క్వారీల్లో కొనుగోలు చేసిన ముడి రాళ్లను పెద్ద ట్రాలీల్లో కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై ఓడరేవులకు రోడ్డుమార్గంలో... అక్కడి నుంచి ఓడల్లో చైనాకు తరలిస్తారు. లాక్‌డౌన్ వల్ల ఖమ్మం నుంచి అశ్వారావుపేట ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
- ముడి రాళ్లను గ్రానైట్ పలకలుగా కోత కోసి పాలిష్ పట్టే పరిశ్రమ నుంచి రోజుకు రూ.3 కోట్ల పైగా వ్యాపారం సాగుతుంటుంది. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూతపడగా... విక్రయాలు జరగకపోవడం వల్ల... ఇప్పటికే నిల్వలు పేరుకుపోయాయి. యాజమాన్యాలు కార్మికులను భరించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మొత్తం మీద గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టబడింది.
చైనా సరుకు రాదాయె...
ఒక వైపు చైనాకు జిల్లా నుంచి గ్రానైట్ ముడిరాళ్లు తరలిస్తూ... గ్రానైట్ క్వారీల్లో ఉపయోగించే యంత్రాల విడి భాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. క్వారీల్లో ముడి రాళ్లు తవ్వి, కచ్చితంగా కోత కోసి వెలికి తీసేందుకు భారీ యంత్రాలు, క్రేన్లు, డోజర్లు, డంపర్లు వాడుతుంటారు. అవన్నీ రెండు నెలలుగా రావడంలేదు.
ఇదీ చూడండి: ఇంట్లో గది లేక చెట్టుపై క్వారెంటైన్ కేంద్రం!