నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా చేపట్టిన ఓటరు నమోదులో ఈ సారి భారీగా దరఖాస్తులు దాఖలయ్యాయి. మూడు ఉమ్మడి జిల్లాల పరధిలోని 11 జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లాలోనూ విద్యావంతులు భారీగానే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మూడు జిల్లాల పరిధిలో కలిపి మొత్తం 5,17,543 మంది పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపారు.
రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు..
ఆన్ లైన్లోనే ఎక్కువ దరఖాస్తులు దాఖలయ్యాయి. మూడు జిల్లాల పరిధిలో 4,13,475 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా.. 1,04,068 మంది ఆఫ్లైన్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2015 ఎన్నికల్లో మొత్తం 2,81,138 ఓట్లు ఉండగా.. ఈ సారి ఆ సంఖ్య రెట్టింపు అయింది.
అత్యధికంగా ఖమ్మంలో..
మూడు ఉమ్మడి జిల్లాల్లో.. అత్యధికంగా నల్గొండలో 91,739 మంది విద్యావంతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఖమ్మం జిల్లాలో 89,633 మంది, నల్గొండ జిల్లాలో 91,739 మంది, సూర్యాపేటలో 62,428 మంది, యాదాద్రిలో 39,293 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని జనగామ జిల్లాలో 22,564, మహబూబాబాద్ 36,099, వరంగల్ గ్రామీణ జిల్లా 35,718, వరంగల్ అర్బన్ 67,414, భూపాలపల్లి 14,283, ములుగు జిల్లాలో 10,553 మంది పట్టభద్రులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో 4,051 దరఖాస్తులు వచ్చాయి.
ఇంకా గడువు ఉంది..
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం నవంబర్ 6 వరకు ఓటు నమోదు గడువు కేటాయించినా.. ఇదే గడువు ముగింపు కాదని ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఓట్ల నమోదులో మార్పు చేర్పులతో పాటు కొత్తవారు కూడా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొంది.