Farmers suffering through Dharani portal in Khammam: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధరణి పోర్టల్‌లో మిస్సింగు సర్వే నెంబర్లు, భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గుల దరఖాస్తులు పేరుకు పోతున్నాయి. ధరణి పోర్టల్‌లో ప్రధానంగా వారసత్వ భూములు, మ్యూటేషన్లు, నిషేధిత భూముల జాబితా, గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్‌తో పాటు మొత్తం 33 రకాల మాడ్యూల్స్‌ను ప్రభుత్వం పోర్టల్‌లో పొందు పరిచింది. ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూసమస్యలకు పరిష్కరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా దరఖాస్తుల స్వీకరణ సమస్యలను పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా కార్యాచరణ కొనసాగిస్తున్నారు.
7 వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లోనే: ప్రధానంగా మ్యుటేషన్లు, జీఎల్ఎం, నిషేధిత భూముల జాబితాలో వచ్చిన దరఖాస్తుల్లో రెండు జిల్లాల్లోనూ దాదాపు 85 శాతం సమస్యలకు యంత్రాంగం పరిష్కారం చూపగలిగింది. కానీ మిస్సింగు సర్వే నెంబర్ భూములు, భూ విస్తీర్ణంలో వ్యత్యాసాల అంశాల్లో రైతుల సమస్యలకు పరిష్కారం రెవెన్యూ యంత్రాంగానికి కష్టతరంగా మారింది. పాత 1బీ రికార్డుల్లో ఉన్న భూముల వివరాలు.. కొత్త పట్టా పాసు పుస్తకాల్లో తప్పుగా నమోదవటం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ తరహా సమస్యలు దాదాపు 7 వేల వరకు దరఖాస్తులు రెవెన్యూ శాఖలో పేరుకుపోయాయి. భద్రాద్రి జిల్లాలో సుమారు వెయ్యికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
రోజుకు పదుల సంఖ్యలో దరఖాస్తులు: ధరణి పోర్టల్ ప్రకారం జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల్లో సాంకేతిక కారణాలతో తప్పులు దొర్లడం ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. వీటి పరిష్కారం రైతులు కోసం మీసేవా కేంద్రాల్లో నగదు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. కానీ సాంకేతిక కారణాలతో బాధిత రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సుమారు 6 నెలల కిందట మిస్సింగు సర్వే, భూవిస్తీర్ణంలో తేడాలు ఉండటంతో పరిష్కారం కోసం టీఎం33 పేరుతో కొత్త మాడ్యూల్‌ను ప్రభుత్వం తీసుకురావడం వల్ల భూ సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. కొందరి సమస్యలు పరిష్కరించినా.. రోజుకు రెండు జిల్లాల పరిధిలో పదుల సంఖ్యలో దరఖాస్తులు నమోదవుతుండటం గమనార్హం.
7మండలాల్లోనే అధికం: ఆన్‌లైన్‌లో సమస్య పెండింగ్ అని కనిపిస్తుండటంతో.. కొందరు రైతులు రెండు, మూడుసార్లు దరఖాస్తులు చేసినా ఫలితం లేకుండా పోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్సింగు సర్వే నెంబర్లు, భూ విస్తీర్ణంలో తేడాలు వంటి సమస్యలు 7 మండలాల్లో అధికంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని దాదాపు అన్ని మండలాల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవచూపి తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
"నాకు పాండురంగపూరంలో 5 ఎకరాల భూమి ఉంది. ధరణి పోర్టల్‌లో ఇంత వరకు పేరు రాలేదు. పోర్టల్‌లో మిస్సింగు నెంబర్లు అని గతంలో కలెక్టర్ కూడా చెప్పాం. కార్యాలయాల చూట్టూ తిరిగాం. ఎవరు స్పందించడం లేదు. ఇలా నేనే కాదు మా ఊరు నుంచి చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు."-స్థానిక రైతు
ఇవీ చదవండి: