ఖమ్మం బస్టాండ్ సమీపంలోని రైతు బజార్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. లాక్డౌన్ సమయంలో పాత రైతుబజార్ ను అధికారులు మూసివేశారు. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా నగరంలోని మిగిలిన రెండు రైతుబజార్లు తెరిచారు. ప్రధాన రైతు బజార్‌ను ప్రారంభించాలని రైతులు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
అందులో భాగంగా గురువారం ఉదయం పలురాజకీయ పార్టీల సాయంతో రైతుబజార్ తెరిచారు. తమ సరుకును విక్రయిస్తున్నారు. అధికారులు ఈరోజు రైతు బజార్ మూసివేసి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో రైతులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒక్కసారిగా పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసుకొని లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మహిళా రైతులను, ఆందోళనకారులను, రాజకీయ పక్షాల నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. దళారులకు మేలు చేసేందుకు అధికారులు, తెరాస నేతలు ప్రధాన రైతుబజార్‌ను మూసివేశారని రైతులు ఆరోపిస్తున్నారు.
- ఇదీ చదవండి : నేటి నుంచే బతుకమ్మ సంబురాలు.. కనిపించని సందడి