కొవిడ్ మూడో దశ తప్పదన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం ముందే అప్రమత్తమవుతోంది. మూడో దశలో కరోనా మహమ్మారి ప్రభావం పిల్లలపై పడుతుందన్న ముందస్తు సంకేతాలతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చిన్నపిల్లల ప్రత్యేక కొవిడ్ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
రాష్ట్రంలోనే తొలి కేంద్రంగా చిన్నారుల సంరక్షణ కోసం ఖమ్మంలో కేంద్రం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. మొత్తం 40 పడకలకు ఆక్సిజన్ సౌకర్యంతో కేంద్రం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐ ప్రతినిధులను మంత్రి పువ్వాడ అజయ్ అభినందనలు తెలిపారు. కొవిడ్ కట్టడిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముందుందని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.