వైరాలోని రింగ్ రోడ్, పాత బస్టాండ్, శాంతినగర్, మధిర రహదారుల్లో పెద్దగుంతలు ఏర్పడ్డాయి. ఆయా రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. వైరా నుంచి మధిర, జగ్గయ్యపేట దారులు అధ్వానంగా తయారయ్యాయి.
తాటిపుడి, జానకీపురం, రెబ్బవరం వద్ద రహదారి దాటాలంటే చిన్నసైజు పిల్లకాలువ దాటిన అనుభూతి కలగకమానదు. కొత్తగా ఈ రహదారులపైకి వచ్చే వారు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏన్కూరు మండలంలో ముచ్చర్ల రహదారి, వైరా నుంచి తల్లాడ వెళ్లే దారితోపాటు తల్లాడ నుంచి సత్తుపల్లి వెళ్లే రోడ్లు అత్యంత దారుణంగా మారాయి. ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామాలతో ఆంధ్రా ప్రాంతాన్ని కలిపే మధిర రోడ్, నెమలి రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ రహదారులు, భవనాల శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోతున్నారు.
రహదారులు, భవనాల శాఖ నిర్లక్ష్యానికి మిషన్ భగీరథ అధికారులు తోడయ్యారు. రహదారిపై ఎక్కడికక్కడ గుంతలు తవ్వి అలానే వదిలేశారు. వైరా గురుకులం వద్ద రోడ్డుకు అడ్డంగా పైప్‌లైన్ కోసం తీసిన గుంత అలానే వదిలేయడం వల్ల ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఇక్కడే ఓ ఉపాధ్యాయుడికి ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. నెలల తరబడి గుంతల రహదారులతో ఇబ్బందులు పడుతున్నామని సత్వరమే మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: ఖమ్మం పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజలు