రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. వైరా మండలం రెబ్బవరం నుంచి కొణిజర్ల మండలం తనికెళ్ల వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని.. రైతులు పండించిన పంటలను మార్కెట్లలోనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులను నష్టపరిచే విధంగా వ్యవసాయ బిల్లులు ప్రవేశ పెట్టిందని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. ఈ బిల్లులు వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
కార్పొరేట్ రంగాలకు అనుకూలంగా బిల్లులను ప్రవేశపెట్టిందని, పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేసి రైతాంగానికి మేలు చేకూరే విధంగా చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు, వైరా నియోజకవర్గ సీపీఎం ఇన్ఛార్జి భూక్యా వీరభద్రం, సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు