Bhadrachalam Godavari Water Level : రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.. దీంతో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుంది. భద్రాచలం వద్ద 43.6 అడుగుల వరకు పెరిగిన గోదావరి నీటిమట్టం మధ్యాహ్నం 12 గంటలకు 43.4 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. రెండు అంగుళాల గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు తగ్గటం వల్ల భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. గోదావరి నీటిమట్టం 42 అడుగులకు తగ్గితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోనున్నారు. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులు దాటి ప్రవహిస్తున్నట్లు కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు.
Now Godavari River Water Level at Bhadrachalam : గోదావరి నుంచి 9,51,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వరద నీటి వల్ల ముంపునకు గురయ్యే పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. వరద ఉధృతి దృష్ట్యా ప్రజలు జిల్లా యంత్రాంగం తెలిపిన సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక అల సూచించారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేయాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. వర్షాల వల్ల పొంగి పొర్లుతున్న వాగులు దాటొద్దని చెప్పారు. రహదారులపైకి నీరు చేరిన ప్రాంతాల్లో రవాణా నియంత్రణ చేసేందుకు బారికేడింగ్ చేయడంతో పాటు ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి యంత్రాంగం తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Godavari River Drone Visuals : మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోన్న గోదావరి
ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు : శనివారం భద్రాచలంలో గోదావరి నీటి మట్టం పెరిగినందున 42.3 అడుగులకు చేరుకుంది. ఆదివారం నీటిమట్టం 43.3 అడుగులకు చేరి ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి ప్రవహించింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నందున గోదావరిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని భావించారు. దీంతో నీటి మట్టం పెరగడంతో భద్రాచలం స్నాన ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరద నీటితో మునిగిపోయాయి. కొత్త కాలనీ దగ్గర వరద నీరు పోటెత్తడంతో సుమారు 28 కుటుంబాలకు అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం మొత్తం వస్తున్న వరద నీటిపై సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి :