mid day meal scheme problems: కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఈనెల 6నుంచి సర్కారీ బడుల్లో మధ్యాహ్నభోజనం బంద్ చేయాలని ఏజెన్సీలు నిర్ణయించాయి. మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం అందించే ఖర్చు, వేతనం తక్కువే అయినా విధిలేని పరిస్థితిలో పథకాన్ని కొనసాగిస్తున్నామని ఏజెన్సీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 673 ఏజెన్సీల్లో 1134 మంది కార్మికులు పనిచేస్తూ దాదాపు 60వేల మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. దాదాపు నాలుగు నెలలుగా ఖర్చుల కింద ఏజెన్సీలకు రూ.1.78 కోట్లలకుపైగా ఇవ్వాల్సి ఉండగా... జీతాల కింద రూ.24లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రోజురోజుకు ధరలు పెరుగుతుండగా ప్రభుత్వం చెల్లించాల్సిన ఖర్చు పెంచాలి. కానీ పెంచడం మాట దేవుడెరుగు మూడు నెలలుగా బకాయిలు పెట్టారని ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు.
ప్రభుత్వం గుర్తించడంలేదు..
ఎన్నో కష్టనష్టాలకోర్చి తాము పథకాన్ని కొనసాగిస్తున్నా.. ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి వారానికి 3 గుడ్లు, పండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెట్‌లో ఒక గుడ్డు ఐదున్నర నుంచి ఆరు రూపాయలు ఉండగా.. ప్రభుత్వం రూ.4 మాత్రమే చెల్లిస్తోంది. కిలో కూరగాయలకు రూ.25 ఇస్తుంటే... మార్కెట్‌లో 40 నుంచి 60 రూపాయల మేర ధరలు ఉన్నాయి. వంటనూనె 120 రూపాయలుంటే ప్రభుత్వం 75 మాత్రమే చెల్లిస్తుండటం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.
మాట నిలబెట్టుకోలే..
ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తున్నా.. వంట గ్యాస్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకోలేదు. ఫలితంగా కట్టెల పొయ్యిలపైనే వండాల్సి వస్తోంది. వంట వండేవారికి నెలకు వెయ్యి రూపాయలు వేతనం అందిస్తున్నారు. కూలీకి వెళ్తే రోజుకు తక్కువలో తక్కువ రూ.300 వస్తున్నాయని... అందుకే వంట చేయడానికి ఆసక్తి చూపడంలేదని కార్మికులు వాపోతున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టాలని ప్రభుత్వం ఎలాగైతే ఒత్తిడి చేస్తుందో... అదే తరహాలో బిల్లుల కోసం ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు చెబుతున్నారు. నాలుగు నెలల నుంచి ప్రభుత్వం బిల్లులు ఇవ్వక పోవడం వల్ల తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతోందని వాపోతున్నారు.
ఇదీ చదవండి: Adavi thalli song: భీమ్లానాయక్ 'అడవి తల్లి' సాంగ్ వచ్చేసింది