ఆస్పత్రుల్లోని ప్రతి పడకకు ఆక్సిజన్ సరఫరా ఉండాలన్న ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దవాఖానాలో ప్రభుత్వం లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు ఏర్పాటు చేసింది. కరోనా వ్యాప్తి మొదట్లో బాధితులకు ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధించింది. దాదాపు ప్రతి ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
21 వేల లీటర్ల సామర్థ్యం గల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు
అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తకుండా 85 లక్షల రూపాయల వ్యయంతో 21 వేల లీటర్ల సామర్థ్యం గల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనితో కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన 350 పడకలకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు.
మొదట్లో ఇబ్బందులు
కరోనా ప్రబలిన మొదట్లో కొంతమందికి ఆక్సిజన్ సరఫరా అవసరమయ్యేది. రోజుకు 50 నుంచి 60 ఆక్సిజన్ సిలిండర్లు వినియోగించాల్సి వచ్చేది. దానివల్ల ఆక్సిజన్ సరఫరా సామర్థ్యం సరిపోక ఇబ్బందులు ఎదురయ్యేవి. రవాణాలోనూ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ రత్నమాల చెబుతున్నారు.
రోజు వందకు పైగా పాజిటివ్ కేసులు
కరీంనగర్ జిల్లాలో రోజు వందకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇందులో దాదాపు 90 శాతం మంది హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. దీని వల్ల ఆస్పత్రులపై ఒత్తిడి చాలా తగ్గిందని వైద్యులు చెబుతున్నారు. ప్రజల్లో కరోనాపై అవగాహన పెరిగిందని అంటున్నారు. అత్యవసరమైన వారికి ఆక్సిజన్ అందించేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నట్లు వెల్లడిస్తున్నారు.
ఇదీ చదవండి: కూతురిపై మూడేళ్లుగా తండ్రి అత్యాచారం!