కరీంనగర్ జిల్లాలోని రెండు రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఓవర్ బ్రిడ్జిలు నిర్మించి.. ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎంపీ బండి సంజయ్ రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్‌శర్మను కోరారు. దిల్లీలో ఆయన రైల్వే అధికారులను కలిసి లెవల్ క్రాసింగ్‌ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
తీగల గుట్టపల్లివద్ద రైల్వే లెవల్ క్రాసింగ్‌తో ప్రజలు అనేక ఇబ్బందుల పడుతున్నట్లు ఆయన వివరించారు. కరీంనగర్ నుంచి లక్సెట్టిపేటకు వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సత్వరమే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని సునీత్ శర్మను ఎంపీ కోరారు.
దక్షిణ మధ్య రైల్వే అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే రైల్వే బోర్డుకు పంపినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ గుర్తు చేశారు. కొత్తపల్లి నుంచి గంగాధర మార్గంలో రైల్వే క్రాసింగ్‌ను రద్దు చేసి.. ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని బండి సూచించారు.
పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట్-పెద్దపల్లి మార్గంలో బైపాస్ లైన్ నిర్మాణం చేపట్టాలని విన్నవించారు. ఆ మార్గానికి సంబంధించి ఇప్పటికే సర్వే పనులు పూర్తయ్యాయని... నిధుల లభ్యతను బట్టి ముందడుగు వేయాలని కోరినట్లు సునీత్ శర్మ వివరించారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణానికి రూ.325 కోట్లు కేటాయించగా ఆ పనులు వేగవంతం చేయాలని బండి కోరారు.
కరీంనగర్-హసన్‌పర్తి వయా హుజూరాబాద్ మీదుగా.. మధ్య కొత్తలైన్ నిర్మాణం సర్వే పనులు గతంలోనే మంజూరయ్యాయని బండి తెలిపారు. ఆ లైన్‌కు ప్రజల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు జరగలేదని అన్నారు. రాబోయే సప్లిమెంటరీ బడ్జెట్లోనైనా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ లైన్‌కు తగిన నిధులు కేటాయించేలా చూడాలని కోరినట్లు బండి సంజయ్ వివరించారు.
ఇదీ చూడండి : ఘనంగా నాగోబా జాతర ప్రారంభం