హుజూరాబాద్ ఉపఎన్నికలు(huzurabad by election 2021) దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలని ప్రచారం జరగుతోంది. ఆత్మగౌరవం పేరుతో బరిలో దిగిన ఈటల రాజేందర్‌ను గెలిపించేందుకు భాజపా ఓవైపు.. ఎలాగైనా విజయభావుటా ఎగరేసి పరువు కాపాడుకోవాలని అధికారపార్టీ తెరాస మరోవైపు.. తన ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ ఇంకోవైపు.. రసవత్తర ప్రచారం జరుగుతోంది.
అన్ని రకాల ప్రయత్నాలు..
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్నికలకు మరో పక్షం రోజులే గడువు ఉండటంతో.. ఆయా పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు ఆ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర ముఖ్య నేతలంతా హుజూరాబాద్‌లో మకాం వేసి.. కేడర్‌తో కలిసిపోయి పనిచేస్తున్నారు.
ఆరోపణప్రత్యారోపణలు..
కులాలు, వర్గాల వారిగా ఆత్మీయసమావేశాలు, సభలు, రోడ్‌షోలతో పాటు నాయకులు నేరుగా ఓటర్లను కలుస్తున్నారు. భాజపా, తెరాస నాయకులు.. ఒకరి మీద ఒకరు విమర్శలతో హోరెత్తిస్తూ.. ఆకర్షిస్తున్నారు. ముఖ్య నాయకులంతా బరిలో దిగి.. తమతమ పార్టీల పథకాలను వివరిస్తూ.. తమ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. మంత్రిగా ఇన్ని రోజులుండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఈటలపై తెరాస నాయకులు ఆరోపణలు చేస్తే.. చేసేంత అవకాశమే ఇవ్వకుండా చేస్తున్నారని ప్రత్యారోపణలు చేసుకుంటూ.. జనాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
చాటుమాటుగా..
ఇది ఒక వైపు అయితే.. డబ్బుల ప్రాబల్యంతో ఓటర్లను ఆకర్షించే పద్ధతి మరోవైపు చాటుమాటుగా జరుగుతూనే ఉంది. సాయంత్రం వేళల్లో జరిగే సభలతో పాటు ఉదయం వేళల్లో ప్రచారానికి పార్టీ నాయకులు డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఉదయం ప్రచారానికి వస్తే 300 రూపాయలతో పాటు టిఫిన్లు, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నారు. సాయంత్రం వేళల్లో జరిగే ధూంధాంతో పాటు రోడ్‌షోలకు జనాన్ని తరలించాలంటే మరో ధర చెల్లించాల్సిన డిమాండ్ ఏర్పడింది. ఇలా డబ్బులు యథేచ్ఛగా పంచుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఒక్క ఓటు కూడా పోకుండా..
హోరాహోరీ పోటీ ఉండటం వల్ల బూతుస్థాయిలో ఓట్లు కోల్పోకుండా.. వార్డుల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఒక్క ఓటు కూడా పక్కకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకోసం కావాల్సినంతగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఓటర్ల ప్రచారానికే ఈ స్థాయి చెల్లిస్తున్నారంటే... పోలింగ్ నాటికి డబ్బు పంపకాలు ఏ స్థాయికి చేరుతాయోనన్న చర్చ జరుగుతోంది.
ఆంక్షలతో ఈసీ కళ్లెం..
కొవిడ్ నిబంధనల మేరకు ప్రచారాలపై ఇప్పటికే ఈసీ అనేక ఆంక్షలు విధించింది. ఇప్పటిదాకా ఆంక్షలు ఉల్లంఘిస్తూ ఆయా రాజకీయ పార్టీలు మీటింగులు, ర్యాలీలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ప్రచార సమయాలు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఉండాలని నిర్ణయించింది. స్టార్ కాంపెయినర్లు పాల్గొనే బహిరంగసభల్లో గరిష్ఠంగా వెయ్యి మందికి మించి ఉండరాదని పేర్కొంది. ఇండోర్ మీటింగులైతే.. కేవలం 200 మందిలోపే ఉండాలి. బైక్ ర్యాలీలు, ఇతర ఊరేగింపులు నిషేధించారు. ఇంటింటి ప్రచారానికి ఐదుగురు మాత్రమే ఉండాలి. వీధుల్లో నిర్వహించే మీటింగుల్లో 50 మంది, వీడియో వ్యాన్ల ప్రచారంలోనూ 50 మంది ఆడియన్స్ మాత్రమే ఉండాలి.
పోలీసుల నిఘా..
ఇలాంటి నిబంధనలపై పోలీసులు, అధికారులు నిఘా పెట్టనున్నారు. ఇప్పటికే వీడియో వాహనాల ద్వారా మొత్తం మీటింగ్‌లను షూట్ చేసి ఎప్పటికప్పుడు ఈసీకి పంపిస్తున్నారు. ఇకపై కేసులు నమోదు చేసి, నోటీసులు జారీ చేయనున్నారు. ఇంకోవైపు పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ చోట్ల జరిపిన వాహనాలు, ఇతర తనిఖీల్లో సుమారు 89 లక్షల విలువైన నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అనేక మందిని బైండోవర్ చేశారు.
తెరాస నేతపై కేసు..
హుజూరాబాద్ తెరాస నేతపై కేసు నమోదైంది. తెరాస నేత భగవాన్ రెడ్డి అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. భగవాన్ రెడ్డితో పాటు సిటీ సెంటర్ కన్వెన్షన్ యజమాని శోభారాణిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: