మధ్య మానేరు జలాశయం కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా నిర్మిస్తున్న ఉప కాలువల ద్వారా క్షేత్ర స్థాయిలో కాళేశ్వరం జలాలను అందిస్తామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఉపకాలువల నిర్మాణానికై భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.32 లక్షల 64 వేల చెక్కులను క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
మెట్ట ప్రాంతమైన బెజ్జంకి, గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాలకు ఏడాదికి రెండు పంటలు పండేలా పుష్కలంగా సాగునీటిని అందిస్తామని రసమయి తెలిపారు. ఇప్పటికే సంబంధిత రైతులు బీడు భూములను చదువు చేస్తుండం చూసి హర్షం వ్యక్తం చేశారు. 70 శాతం పూర్తి కాగా మిగిలిన పనులకు గానూ సీఎం కేసీఆర్ రూ.4 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, రైతులు పాల్గొన్నారు.