కరీంనగర్ జిల్లా చింతకుంటలో మంత్రి గంగుల కమలాకర్ (Minister gangula kamalakar) భూమిపూజ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ ఓ మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. కరీంనగర్ జిల్లా (karimnagar district) చింతకుంట గ్రామం నుంచి కొత్తపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్... మేయర్ సునీల్ రావు(mayor sunil rao)తో కలిసి భూమి పూజ(land puja) చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మంత్రికి మహిళ ఫిర్యాదు
ఈ క్రమంలో ఓ మహిళ తమకు న్యాయం చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌కు విన్నవించుకుంది. చింతకుంటలో ఇంటి నిర్మాణం చేపడుతున్నామని, గ్రామ పంచాయతీలో అనుమతి కోసం దరఖాస్తు చేశామని, చింతకుంట గ్రామ సర్పంచ్ (sarpanch) మంజుల... అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన మంత్రి.. ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డిని పిలిచారు. సాయంత్రంలోపు ఆ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈక్రమంలో పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేరు. దీంతో మంత్రికి చిర్రెత్తుకొచ్చింది.
సెక్రటరీపై మంత్రి సీరియస్
''ఏ సెక్రటరీ ఎక్కడున్నవ్...? మంత్రి ఎక్కడున్నడు... నువ్వెక్కడ సచ్చినవ్''... అంటూ మంత్రి ఫోన్లో సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ మంజుల, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డిని పిలిచి మహిళ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. సర్పంచ్‌ను ఇలాంటి విషయాలు మళ్లీ పునరావృతం కావొద్దని మందలించారు.
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
అనంతరం కేటీఆర్ (KTR BIRTHDAY)పుట్టిన రోజు వేడుకలను కరీంనగర్లో తెరాస శ్రేణులతో కలిసి మంత్రి ఘనంగా నిర్వహించారు. 45 కిలోల కేకును మంత్రి గంగుల, మేయర్ సునీల్‌రావు కలిసి కట్ చేశారు. మహిళలకు మొక్కలను పంపిణీ చేసారు. వ్యవసాయ మార్కెట్లో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు కలిసి మొక్కలను నాటారు.
ఆశీర్వదించిన మంత్రి
నవ యువ నాయకుడు మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి గంగుల కొనియాడారు. అతి తక్కువ సమయంలో నాయకునిగా ఎదిగారని అన్నారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పదవులు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కల్పించాలని... నిండుగా ఆశీర్వదించాలని గంగుల కమలాకర్ కోరారు.