కరీంనగర్ పోలీస్ శిక్షణా కేంద్రం హరితవనంగా మారిపోయింది. ఒకే ప్రాంగణంలో రెండు మియావాకి అడవులతోపాటు సరికొత్త వనాలను నెలకొల్పారు. నవగ్రహవనంతోపాటు రాశి, నక్షత్ర వనాలు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. 9 గ్రహాలను వివరిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. ఏ గ్రహానికి ఏ చెట్టు సరిపోతుందనే అంశాన్ని వివరించారు. చెట్టుకు సంబంధించి వ్యవహారిక నామంతో పాటు శాస్త్రీయ నామాన్ని తెలుగు, ఆంగ్లంలో సూచించే బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ విధంగా చేయడం వల్ల.. తమకు ఏ చెట్టు సరైనదో ప్రజలకు అవగాహన కలుగుతుందని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
పంచతత్వ నడకదారితో ఆరోగ్యం
ఇక్కడి రాశివనంలోనే పంచతత్వ నడకదారిని ఏర్పాటు చేశారు. ఈ దారిని ప్రధానంగా ఏడు రకాల సామగ్రితో రూపొందించారు. ఇసుక, రంపపు పొట్టు, ఒండ్రుమట్టి, నీటితో నడకదారిని రూపొందించారు. పాదరక్షలు లేకుండా ఈ ట్రాక్‌పై నడవడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఆక్యుపంక్చర్ విధానంలో రూపొందించిన నడకదారిలో వివిధ సైజుల్లోని ఏర్పాటు చేసిన గులక రాళ్లతో.... నరాలు స్పందించి ఆరోగ్యాన్ని సమకూరుస్తాయని తెలిపారు. బండరాళ్లతో నిండిన ప్రాంతాన్ని రాక్‌గార్డెన్‌గా తీర్చిదిద్దారు. రాక్‌గార్డెన్ చూడటానికి ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆదాయ మార్గాలపై దృష్టిసారించిన ఆర్టీసీ