ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తొలిదశలో కేసులు అంతగా కనిపించకపోయినా.. రెండోదశలో మాత్రం అనూహ్యంగా పెరిగిపోయాయి. ఏ గ్రామంలో చూసినా వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం స్థానికులే కాక జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, లక్షేట్టిపేట ప్రాంతాల నుంచీ పెద్ద ఎత్తున బాధితులు తరలివస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆసుపత్రిలో పడకల సంఖ్యను పెంచినట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 339 పడకలతో పాటు 221 ఆక్సిజన్ పడకలు, 40 వెంటిలేటర్లు ఉన్నట్లు వివరించారు.
ఓవైపు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత, పడకల కొరత ఉన్నా.. కరీంనగర్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదని వైద్యాధికారులు వెల్లడించారు. అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే వ్యాధి తీవ్రత పెరగడానికి చాలా తక్కువ సమయం పడుతోందని.. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.