జలాశయాల జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి ఆశలను సజీవంగా నిలిపే పనులకు ఈ కొత్తఏడాది ఆలంబనగ నిలువబోతోంది. మానేరు, మూలవాగు, మోయతుమ్మెద వాగులపై రూ.54కోట్లతో నిర్మిస్తున్న 184 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చురుగ్గా సాగాలి.
● ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ పరిధిలోని చిన్ననీటి వనరులు, కాలువల బాగు కోసం కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన రూ.180కోట్ల పనుల్లో కదలిక కనబడాలి. కాళేశ్వరం మూడో టీఎంసీ దిశగా అడుగులు పడితే ఉమ్మడి జిల్లాలో మరిన్ని ఉపయుక్తమైన పనులకు ఈ 12నెలల్లోనే మోక్షం లభించే వీలుంది.
‘జలధార’లకు దన్నుగా..
● రైల్వేప్రగతి పట్టాలెక్కేలా ఈఏడాదిలో నిధుల వరద నాలుగు జిల్లాలకు పారితే పెండింగ్ పనులు పూర్తవుతాయి. కరీంనగర్‌లోని రోడ్డు అండర్ బ్రిడ్జితోపాటు పెద్దపల్లి జిల్లాలోని పలు పనులు, సిరిసిల్ల జిల్లాలో కొత్త మార్గం ఏర్పాటు దిశగా ప్రగతి కనిపించే వీలుంది.
● ఆరోగ్యహబ్‌గా మారేలా నాలుగు జిల్లాల పరిధిలో ఈ ఏడాదిలోనే వ్యాధినిర్ధారణ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. 57 రకాల పరీక్షల్ని నిర్వహించే వీటి భవనాలు, యంత్రాలన్ని సిద్ధమయ్యాయి.
● పెద్దపల్లి జిల్లాలో రూ.10వేల కోట్లతో 1600మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ నిర్మిస్తున్న తెలంగాణ పవర్ ప్లాంట్ ఈ ఏడాది నవంబరు నాటికి సిద్ధమవనుంది. అంతర్గాం మండలంలో ఐటీపార్క్ ఏర్పాటు దిశగా చొరవను చూపిస్తే పారిశ్రామిక పురోగతి దరిచేరనుంది.
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తికి సిద్ధపడుతుండటం మంచి విషయం. ఇదే విధంగా కేంద్రం చొరవచూపిస్తే జగిత్యాల జిల్లా పొలాసకు ఆవాల పరిశోధన కేంద్రం మంజూరు మరికొన్ని నెలల్లో అయ్యే వీలుంది.
వికాసపు వెల్లువలా..
పారిశ్రామిక, పర్యాటకాల పరంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెరవాల్సిన అవసరముంది. ముఖ్యంగా ఆధ్యాత్మికత, పర్యాటక ప్రదేశాల ఖిల్లాలుగా జిల్లాలుగా నాలుగు జిల్లాలు పేరొందాయి. ఇప్పటికే సిరిసిల్లలో అపారెల్ పార్క్ ముస్తాబవుతోంది. ఇక్కడ ఇప్పటికే రెండు పరిశ్రమలు ఎంవోయూ చేసుకున్నాయి. రూ.20కోట్లతో ఓ పరిశ్రమను నమూనాగా నిర్మిస్తున్నారు. మొత్తం 60 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఇక్కడ మరో 15 వరకు పరిశ్రమలు వచ్చేందుకు ఈ సంవత్సర కాలమే అనువైన సమయం. ఇక్కడ పనులు పూర్తయితే ఈ ఏడాదిలో 30వేల మంది మహిళలలకు ఉపాధి లభించే అవకాశం ఉంది.
‘ఆశల’ సమహారమిలా..
● కరీంనగర్ సమీపంలో నిర్మిస్తున్న తీగల వంతెన నిర్మాణం వాడుకలోకి వచ్చేందుకు కొత్త సంవత్సరం వారథిగానే మారనుంది. రూ.169కోట్లతో నిర్మిస్తున్న పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. ఏళ్లకల సాకారమయ్యేందుకు 2021 కారణంగా మారనుంది.
● కరీంనగర్‌కు ఊరింపుగా మారిన ట్రిపుల్ ఐటీ, మెడికల్ కళాశాలల మంజూరు దిశగా మోక్షం లభించాలి. గతంలోనే రూ.150కోట్లకుపైగా నిధులు కేటాయించిన మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడితే మేలు.
ఇదీ చదవండి: కిమ్ 'కొత్త' సందేశం- 1995 తర్వాత ఇదే!