మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన ఉత్తరం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఈ ఉత్తరం 'ఫేక్ లెటర్' అంటున్న భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారిపై ఒట్టేసి చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా అవగాహన సదస్సులో స్థానిక ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
తల్లి లాంటి పార్టీకి, తండ్రి లాంటి కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఈటల రాజేందర్ పేరు వెన్నుపోటు రాజేందర్, భాజపా రాజేందర్‌గా మారిపోయిందని బాల్క సుమన్ దుయ్యబట్టారు. ఈటలకు తెరాసలో సముచిత స్థానం కల్పించింది నిజం కాదా అంటూ నిలదీశారు. అధికారం కోసం పార్టీలు మార్చే చరిత్ర భాజపా నాయకులదంటూ విమర్శించారు. ఈటల తన ఆత్మాభిమానాన్ని దిల్లీ దొరల వద్ద తాకట్టు పెట్టాడని.. ఆత్మ గౌరవం గురించి మాట్లాడే హక్కు ఈటలకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జడ్పీ ఛైర్మన్ సుధీర్‌కుమార్, తెరాసవి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, తెరాస రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం హుజూరాబాద్‌లోని అంబేడ్కర్ కూడలి వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి సుమన్ పాలాభిషేకం చేశారు. పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి భాజపా కండువాను కప్పటంపై ప్రజాస్వామిక వాదులంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు బాల్క సుమన్ చెప్పారు. దళిత, ప్రజా సంఘాలు భాజపాను నిలదీస్తున్నట్లు వెల్లడించారు. మహనీయుని విగ్రహానికి పార్టీ కండువాను కప్పి మలినం చేశారని ఆరోపించారు. పాలాభిషేకం చేసి ఆ మలినాన్ని తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై దళిత సంఘాలు చేపట్టే ఏ కార్యక్రమానికైనా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.