Uses of Generic Medicine : జీవన శైలిలో వస్తున్న మార్పులతో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అధిక రక్తపోటు, మధుమేహం, చర్మ సమస్యలు, నిద్రలేమి వంటి రుగ్మతలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్యా ఎక్కువే. వ్యాధి నయం కోసం చేసే ఖర్చులో ఔషధాలు కూడా ఎక్కువ భాగాన్నే హరిస్తాయి. ఇదిలా ఉంటే.. జనరిక్ మందులతో ఔషధాల ఖర్చు తగ్గించుకొనే అవకాశం ఉన్నా అవగాహన లేక జేబులు గుల్ల చేసుకుంటున్నారు వారు చాలామంది ఉంటారు. దీనికితోడు జనరిక్ మందుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన వైద్యులే.. వాటిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రజల్లో ఉన్న అపోహలు తొలగడం లేదు. వీటన్నిటి కారణంగా చౌక ధరలకు ఔషధాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.
Low cost Medicine in All Medicals : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనరిక్ ఔషధాల తయారీపై దృష్టి సారించడంతో పాటు వీటి వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కొన్ని ఔషధ పరిశ్రమలు జనరిక్ ఉత్పత్తులను తక్కువ ధరకే సరఫరా చేస్తున్నా.. ప్రజల దృష్టిని ఆకర్షించడం లేదు. కారణం వైద్యులు ఈ ఔషధాల్ని సిఫార్సు చేయకపోవడం. జనరిక్ ఔషధాలు సమర్థంగా పని చేస్తాయనే నమ్మకం ప్రజల్లో లేకపోవడమే. చాలా ఔషధ దుకాణాల్లో జనరిక్ ఔషధాలు లభ్యం కాకపోవడం వంటి పరిస్థితులు సైతం జనరిక్ మందుల వినియోగానికి అడ్డంకిగా మారాయి. చిన్నపాటి అనారోగ్యం తలెత్తినా చికిత్స కోసం రూ.వేలు ఖర్చవుతున్న రోజులివి. ఆస్పత్రి పాలైతే ఆర్థికంగా చితికిపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో చౌక ధరల్లో లభ్యమయ్యే జనరిక్ మందులు ఆర్థికభారం తగ్గిస్తాయి. పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే జనరిక్ ఔషధాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే తయారవుతాయి. వాటిల్లో నాణ్యత తనిఖీలు కూడా నిరంతరంగా కొనసాగుతాయని అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ ఎం.శ్రీనివాసులు చెబుతున్నారు.
జనరిక్ ఔషధాలు 80 శాతం తక్కువ ధరకే..: జనరిక్ మందుల పట్ల అవగాహన ఉన్న పేద, మధ్య తరగతి వారికి ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది. కానీ, ఈ దుకాణాలు జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లోనే ఉండటం గ్రామీణ ప్రజలకు దూరాభారం అవుతోంది. అయితే ప్రపంచంలో నుంచి దాదాపు 200 దేశాలకు జనరిక్ ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు ఫార్మాగిల్డ్ పేర్కొంది. విదేశాల్లో గొప్పగా వినియోగంలో ఉన్నా.. భారత్‌లో జనరిక్ మందుల వాడకం అంతంత మాత్రంగానే ఉంది. బ్రాండెడ్ ఔషధాలతో పోలిస్తే జనరిక్ ఔషధాలు 80 శాతం తక్కువ ధరకే లభ్యమౌతాయి. దాంతో ఈ మందులు బాగా పని చేస్తాయో లేదోనన్న అపోహ ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు బ్రాండెడ్ ఔషధ తయారీ సంస్థలు మార్కెటింగ్ వ్యూహాలతో విక్రయాలను పెంచుకుంటున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు తమ ఉత్పత్తులనే రోగులకు సిఫార్సు చేసేలా తాయిలాలు అందిస్తుండటంతో జనరిక్ మందుల వాడకం తగ్గడానికి కారణమవుతోంది.
Online Generic Medicine Service in Karimnagar : కేంద్ర ప్రభుత్వం జనరిక్ మందులే రాయాలని సర్క్యులర్ విడుదల చేయడం తప్ప.. అమలు జరుగుతోందా లేదా అనే విషయం పట్టించుకోవడం లేదు. ప్రజల్లో అవగాహనతో పాటు వైద్యులపై ఒత్తిడి తీసుకొస్తే జనరిక్ మందుల విక్రయాల్లో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో మందుల కొనుగోలు పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనూ సరఫరా చేసే విధానం వల్ల కూడా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వాలు జనరిక్ మందులని ప్రోత్సహించాలి : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా-2002 కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ నిబంధనల ప్రకారం ప్రతి వైద్యుడు సాధ్యమైనంత వరకు రోగులకు జనరిక్ మందుల్ని సూచించాలి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ఈ నిబంధన బహిరంగంగానే తుంగలో తొక్కుతున్నారు. బ్రాండెడ్ మందుల్ని రాయడం నేరం కాదు.. జనరిక్ మందులను సూచించాలనేది కేంద్రం నిబంధన. ఇకపోతే బ్రాండెడ్ మందులు సూచించే వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే సర్కార్ సూచనల్ని వైద్యులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఉంది.
"జనరిక్ మందులు బ్రాండెడ్ ధరతో పోలిస్తే 30 నుంచి 80 శాతం వరకు తేడా వస్తుంది. పేదవారికి తక్కువ ధరలో లభించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ మెడిసన్‌ను తీసుకువచ్చింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి." -ఎం.శ్రీనివాసులు, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్, కరీంనగర్
ఇవీ చదవండి :