మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు. మరోవైపు ఆయన భార్య జమున కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఈటల రాజేందర్ పర్యటించారు. మండలంలోని చల్లూరులో ఏర్పాటు చేసిన నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. తెరాస చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితువు పలికారు. తాను ఎవరి జోలికి పోనని, వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎవరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. సొంత పార్టీ నాయకులను డబ్బులతో కొనుగోలు చేసిన దౌర్భగ్యం తెరాసలో ఉందని ఈటల ధ్వజమెత్తారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా చివరికి గెలిచేది న్యాయమన్నారు. ఎక్కడ ఎన్నికలు వచ్చినా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించటం వంతుగా మారిందన్నారు. అది కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఉంటుందన్నారు. ఇదీ ఏ రాజకీయమో తెలియాలన్నారు. ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొంతమంది అధికారులను బానిసలుగా చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణనేనని ఎద్దేవా చేశారు. మెజార్టీ ఉన్నా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలు హస్తం గుర్తుపై గెలిచి తెరాసలో చేరి మంత్రులుగా పని చేస్తున్నారని చెప్పారు. ఇదీ ఏ రాజకీయమో చెప్పాలన్నారు.
ఇదీ చదవండి: WTC Final: ఇక రిజర్వ్ డే పైనే.. టీమ్ఇండియా@64/2