ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట పర్యటనకు వెళ్లిన ఆయనకు.. స్థానిక భాజపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెరాసను వీడి ఇటీవల భాజపాలో చేరిన ఈటలకు స్థానిక మహిళలు మంగళహారతులు పట్టారు. భాజపా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇల్లందుకుంటలో కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు హాజరయ్యారు.
'కేసీఆర్ కుట్రలకు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉండాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల విజయం ప్రజల విజయమే. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. రాజీనామా చేస్తే ఎందుకు చేశావని ఎవరూ అడగలేదు. రానున్న ఉప ఎన్నికల్లో గెలిచేందుకు తెరాస కుట్రలు పన్నుతోంది. వాటిని ఈ ప్రాంత ప్రజలే తిప్పి కొడతారు.'
-ఈటల రాజేందర్, భాజపా నేత
ఇక్కడి ప్రజలు ఓట్లేస్తేనే గెలిచానని ఈటల ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో కుల సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేసి గెలిచేందుకు తెరాస పావులు కదుపుతోందని.. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఈటల అన్నారు. తాను ప్రశ్నించేవాడినని, అందుకే తనను మళ్లీ అసెంబ్లీలో అడుగపెట్టకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: owner locked office: అద్దె చెల్లించలేదని ప్రభుత్వ కార్యాలయానికే తాళం