హుజూరాబాద్ ఉపఎన్నిక సీఎం కేసీఆర్ అహంకారం వల్లే వచ్చిందని.. తన వల్ల రాలేదని మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జూపాక, బోతలపల్లిలో ఈటల ప్రచారం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు ఓటేస్తారన్న ధీమా ఉంటే.. లిక్కర్ ఎందుకు పంచుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం పేరుతో డబ్బుల ఆశలు చూపడం.. కొత్త జీవోలు తీసుకొచ్చి ప్రచారం చేయడం తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు.
దళిత బంధు అంటూ నిధులంటూ ఓట్లు వేయించుకోవడం మరో 20 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చడం మాత్రమే లక్ష్యమని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు మాటలు చెల్లవని ఈటల రాజేందదర్ మాట మాత్రమే చెల్లుతుందని ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ఈ ఎన్నికలు కేసీఆర్ అహంకారం వల్ల వచ్చినయి. ఈటలను కేవలం ఒక గడ్డిపోచ అనుకున్నరు. కానీ నాపై చిల్లర ఆరోపణలు చేసి బయటకు పంపిండ్రు. కేసీఆర్‌ను ప్రజలు నమ్మితే ఇక్కడ లిక్కర్ ఎందుకు పంచుతున్నట్టు. ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు. ఇవాళ సిద్దిపేట నుంచి వచ్చినోళ్లు డబ్బుసంచులు, జీవోలు పట్టుకుని ఇక్కడ ప్రచారానికి వచ్చిండ్రు. హుజూరాబాద్ ఈటల రాజేందర్ గడ్డిపోచ కాదు గడ్డపార అని ఇయాల వారికి తెలిసోచ్చింది.- ఈటల రాజేందర్, హుజూరాబాద్ భాజపా అభ్యర్థి
ఇదీ చూడండి: Kcr sabha in Huzurabad : హుజూరాబాద్‌లో కేసీఆర్ సభపై ఉత్కంఠ