రాష్ట్రంలో మరోసారి ఎస్సీలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇవ్వలేమని అప్పుడే చెప్పానని ఈటల అన్నారు. ప్రభుత్వం కేటాయించే తక్కువ సొమ్ముతో భూములు దొరకవని అభిప్రాయపడ్డారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వెల్లడించారు. కొందరు పోలీసులు చట్టాలకు లోబడి కాకుండా చుట్టాలకు లోబడి పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఏడేళ్ల పాలనలో ఎస్సీల పిల్లల చదువులకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంతమంది ఎస్సీల విదేశీ చదువులకు రూ.20 లక్షలు ఇచ్చారో చెప్పాలన్నారు.
మాటలకే పరిమితం
సీఎం కార్యాలయంలో ఏ అధికారి అయినా ఎస్సీలకు సంబంధించిన వారు ఉన్నారా.. అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. వారి ప్రతిభకు తగినంత గుర్తింపు కేసీఆర్ పాలనలో లేదని విమర్శించారు. అన్ని వర్గాలకు అందుతున్న పథకాలే ఎస్సీలకూ అందుతున్నాయని.. ప్రత్యేకంగా వారికి అందించినవి ఏమీ లేవన్నారు. ఎన్నో ఏళ్లుగా వారికి కేటాయించే నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ఏ జాతి వారి వల్ల వారికి పదవి దక్కిందో వారిని అగౌరవపరచొద్దని హితవు పలికారు. చిత్తశుద్ధి ఉంటే ఈ ఏడేళ్ల పాలనలో వారికోసం ఎన్నో చేయొచ్చని చెప్పారు. ఎస్సీ అభివృద్ధి అనేది మాటలకే పరిమితం అవుతోందనే అప్పుడు సబ్‌ప్లాన్ పెట్టామని ఈటల అన్నారు.
'భూ రికార్డుల ప్రక్షాళన వల్ల ఎందరో ఎస్సీలకు అన్యాయం జరిగింది. రెవెన్యూ సంస్కరణల వల్ల ఎందరో ఎస్సీలకు అన్యాయం జరిగింది. తెల్ల కాగితంపై రాసుకుని కొనుక్కున్న భూములు మళ్లీ దొరలకే మళ్లాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన భూములకు పాసుపుస్తకాలు రాకపోవడంతో దళితులు ఇబ్బందిపడ్డారు. మంత్రులు, పార్టీ నేతలకు విలువ ఇచ్చే సంస్కారం తెరాసలో లేదు. ఎన్నికలప్పుడు హామీలతో మభ్యపెట్టి గెలవడమే తెరాసకు తెలుసు.'
-ఈటల రాజేందర్, మాజీ మంత్రి
వారికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
రెండు పడక గదుల ఇళ్లు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే పరిమితమయ్యాయని.. తెరాసతో లబ్ధిపొందిన గుత్తేదారులే కొన్ని చోట్ల ఇళ్లు పూర్తి చేశారని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ సహా ఇతర నియోజకవర్గాల్లో ఇళ్లు పూర్తి కాలేదని అన్నారు. సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు దళితులకు డబ్బులు ఇస్తామన్న ప్రభుత్వం.. ఇవ్వలేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత.. కృష్ణాజలాల ట్వీట్‌పై సీమ రైతుల ఆందోళన