దళితబంధు వద్దని లేఖ రాసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అది తప్పుడు ప్రచారమని ఏకంగా ఎన్నికల కమిషనే స్పష్టం చేసిందని భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. తెరాస ఇప్పటి వరకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎన్నో చేసిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ధర్మంతో గోక్కున్నారని.. మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నియోజకవర్గంలోని నగురం, వావిలాల, గోపాల్‌పూర్, పాపక్కపల్లిలో ఇవాళ ఈటల ప్రచారం నిర్వహించారు.
తమ పార్టీ వాళ్ల షాపులు బంద్ పెట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ అయిన భాజపాకే ఈ పరిస్థితి ఉందంటే తెరాస దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చని ఈటల పేర్కొన్నారు. ఏ పథకం కావాలన్నా ఇంటిమీద తెరాస జెండా ఉండాలంటున్నారు.. రాష్ట్రం మీ జాగీరా అని ప్రశ్నించారు. ప్రజలంతా నన్ను చూసి ఓట్లేస్తారంటున్న కేసీఆర్.. ఆయన బొమ్మ పెట్టుకుంటే కవిత ఎందుకు ఓడిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన రాజీనామాతో ఎన్నో పథకాలు ప్రజల ముంగిట్లోకి వచ్చాయని.. ఇంకా చాలా వస్తాయని, తాను గెలిస్తే తెలంగాణ రాజకీయ చరిత్ర మారుతుందన్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఓడిపోయారు.. ఎవరూ శాశ్వతం కాదన్నారు. కేసీఆర్కు ఓటమి తప్పదని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
18 ఏళ్లు కేసీఆర్ అడుగు జాడల్లో నడిచిన తనను ఆనాడు గొప్పోడు అన్నాడని... ఇవాళ దెయ్యం ఎట్లయిండో చెప్పాలని ఈటల ప్రశ్నించారు. 2002 వచ్చినప్పుడు ఎట్లా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నామన్నారు.
'ఈటల రాజేందర్ దళితబంధు వద్దని లేఖ రాయలేదని.. ఇది తప్పుడు ప్రచారమని ఎన్నికల కమిషనే ప్రకటించింది. కానీ మూడు రోజుల నుంచి ఈటల రాజేందర్ దళితబంధు రాకుండా అడ్డుకుంటున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేనే కదా డిమాండ్ చేసింది.. ఎన్నికల లోపే ప్రతి దళితునికి 10లక్షలు రావాలని.. ఆ 10లక్షల మీద బ్యాంకుల పెత్తనం ఉండొద్దని డిమాండ్ చేసింది నేనే కదా. ఆ 10 లక్షల మీద కలెక్టర్ల అజమాయిషీ ఉండొద్దని చెప్పింది కూడా నేనే కదా.'
-ఈటల రాజేందర్, భాజపా నేత
ఇదీ చదవండి: huzurabad by elections: 'ఎన్నికల ప్రవర్తనా నియమావళి'పై స్పష్టత ఇచ్చిన ఈసీ