కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రచారంలో ఈటల జమున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పోటీలో తానున్నా.. రాజేందర్ ఉన్నా ఒక్కటేనన్న జమున... ఉద్యమంలోనూ ఆయన వెన్నంటే ఉన్నట్లు పేర్కొన్నారు. అధికార పార్టీ వేధింపులపై అసంతృప్తిని వ్యక్తం చేసిన జమున.. ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎవరికి అవకాశం వస్తే వారు పోటీ చేయాలన్న ఆలోచన ఉందని ఆమె అన్నారు. ఎవరు పోటీ చేసినా గుర్తు అదే ఉంటుంది.. కాకపోతే మనుషులే మారొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏం డిసైడ్ చేసుకోలేదు..
ఈటల రాజేందర్ లాంటి ఉద్యమ నాయకుడినే బయటకు పంపించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం.. ఇంకా ఎలాంటి మోసాలకైనా పాల్పడుతుందని ప్రజలు చెప్తున్నరు. పోటీలో నేను ఉన్న ఒక్కటే.. రాజేందర్ ఉన్నా ఒక్కటే.. ఎందుకంటే ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రతిసారి నేను వెనుకుండి నడిపించినా. కాబట్టి ఎవరికి ఛాన్స్ వస్తే వారు నిలబడొచ్చని ప్రజలు అంటున్నరు. మేము ఇంతవరకు ఏం డిసైడ్ చేసుకోలేదు. కాకపోతే గుర్తు అయితే అదే ఉంటది.. మనుషులు మారొచ్చు. -ఈటల జమున, ఈటల రాజేందర్ సతీమణి
జమునకు ఎదురైన వింత పరిస్థితి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఈటల రాజేందర్ సతీమణి జమునకు శనివారం వింత పరిస్థితి ఎదురైంది. మామిండ్ల ప్రాంతంలో ఓ వ్యక్తి మద్యం సేవించి తనకు నాలుగు లక్షలు రావాల్సి ఉందని ఎప్పుడిస్తారంటూ నిలదీశాడు. గతంలో అతని కుమారుడు చనిపోయిన సందర్భంలో రాజేందర్ సొంతంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడమే కాకుండా మరో ఐదు లక్షలు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు మిగతా నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగారు. సొంతంగా పరిహారం ఇచ్చి అతని భార్యకు పార్ట్ స్వీపర్‌గా ఉద్యోగం కూడా ఇప్పించారు. అయితే ఇదంతా పక్కన పెట్టి తనకు రావాల్సిన నాలుగు లక్షలు ఎవరిస్తారంటూ నానా హంగామా సృష్టించాడు. మద్యం తాగి ఉన్నాడని గమనించిన ఈటల జమున, తదితరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: CONGRESS: హుజూరాబాద్ ఉపపోరుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి