కరీంనగర్ జిల్లాలో 319 గ్రానైట్ క్వారీలు (బండలు తీసేవి) ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 150 క్వారీలు నడుస్తున్నాయి. జిల్లాలో మ్యాపుల్ రెడ్, ట్యాన్ బ్రౌన్, ట్యాన్‌బ్లూ, సర్ఫ్‌గ్రీన్ తదితర రకాలకు చెందిన కొండలు ఉన్నాయి. ఇందులో వందలాది హెక్టార్లలో గనులు వ్యాపించి ఉన్నాయి. క్వారీలకు అనుబంధంగా 220 కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా మరో 70 యూనిట్లు నిర్మాణం పూర్తి కావొస్తున్నాయి. వీటికి స్థానిక క్వారీల నుంచే బండలను సరఫరా చేస్తుంటారు. ఇవి కాకుండా 24 కంకర (స్టోన్ క్రేషర్స్) క్వారీలు ఉన్నాయి.
కోట్లలో ఆదాయం..
క్వారీల లీజులు, రాయల్టీ, కటింగ్, పాలిషింగ్ పరిశ్రమల ద్వారా ఏటా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. 2020-21 (నవంబర్ వరకు) సంవత్సరంలో లీజు, రాయల్టీ రూపేణా రూ.109.04కోట్ల ఆదాయం లభించగా, కటింగ్, పాలిషింగ్ యూనిట్ల ద్వారా (నవంబర్ వరకు) రూ.5,49,24,895 ఆదాయం ఆర్జించింది. గ్రానైట్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దిల్లీ ఇలా అనేక రాష్ట్రాలకు, వియత్నాం, రష్యా, దుబాయ్ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలోని క్వారీలలో లభించే బండ నాణ్యమైనది కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడి నుంచి బ్లాక్‌లను కాకినాడ ఓడరేవు ద్వారా చైనాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.
వేలాది మందికి ఉపాధి..
గ్రానైట్ క్వారీలు, గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కో యూనిట్‌లో 20 నుంచి 50 మంది అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వీరే కాకుండా రవాణా రంగం ద్వారా కూడా మరింత మందికి ఉపాధి దొరకుతోంది.
- ఇదీ చూడండి : ఐటీ సోదాల్లో రూ.100 కోట్ల నల్లధనం పట్టివేత