వారం రోజులుగా కురిసిన వర్షాలతో రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూరులో ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన ఇళ్లు, దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. స్థానికులు, రైతులతో మాట్లాడారు. బాధితుల వివరాలను నమోదు చేసుకున్నారు.
ఎడతెరపిలేని వర్షం రైతులను, గ్రామస్థులను ఇక్కట్ల పాలు చేసిందని రాఘవులు తెలిపారు. చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయని, ఇసుక మేటలు వేశాయన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి పరిహారం ఇవ్వటమే కాకుండా... మళ్లీ సాగుకు యోగ్యంగా తీర్చిదిద్దేందుకు గానూ పెట్టుబడి ఖర్చులను అందించాలన్నారు.