కరోనాతో చికిత్స పొందుతూ.. వ్యాధి తీవ్రత పెరిగి మంచంపై నుంచి కిందపడి ఓ వృద్ధుడు చనిపోయిన ఘటన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. కింద పడ్డా... తోటి రోగులు దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో లేక ఆ వృద్ధుడు 45 నిమిషాలు మృత్యువుతో పోరాడాడు.
కరీంనగర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన 70 ఏళ్ల వ్యక్తి కరోనా చికిత్స పొందుతున్నాడు. అయిదు రోజులుగా ఆస్పత్రిలో ఉన్న ఆయన.. ఆదివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి మంచంపై నుంచి కిందపడ్డాడు. కాళ్లు చేతులు కొట్టుకుని విలవిలలాడుతున్నా.. కరోనా భయంతో పక్కనే ఉన్న ఇతర రోగులు దగ్గరకు వెళ్లలేదు. సమయానికి సిబ్బంది కూడా అందుబాటులో లేదు. రోగి కిందపడి ఉన్న తీరును వీడియో తీసి ఇతరులకు పంపించగా.. అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బాధితుడితో పాటు అదే వార్డులో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. చనిపోయిన చాలాసేపటికి ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని తిరిగి మంచంపై ఉంచినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబీకులు రాత్రి వరకు ఆస్పత్రికి రాలేదు. చేసేదేం లేక మృతదేహాన్నిమార్చురీలో భద్ర పరిచారు . ఈ ఘటనలో సిబ్బంది తప్పేమి లేదని బాధితుడు కింద పడగానే.. తక్షణమే స్పందించి ఆక్సిజన్ పెట్టినట్లు ఆస్పత్రి పర్యవేక్షకురాలు రత్నమాల వివరణ ఇచ్చారు.
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు