ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టిందని సత్యం విమర్శించారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న తరుణంలో ఉపాధి లేక అగచాట్లు పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలపై ఎల్ఆర్ఎస్ రూపంలో భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు.
ఓ వైపు వందలాది ఎకరాలున్న భూస్వాములకు రైతుబంధు పేరిట జేబులు నింపుతూ... మరోవైపు ఎల్ఆర్ఎస్ పేరిట పేద ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడటం దారుణమన్నారు. ప్రభుత్వం సత్వరం ఎల్ఆర్ఎస్ను వెనక్కి తీసుకోని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని మేడిపల్లి సత్యం హెచ్చరించారు.