కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మొదలుపెట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర తొలిరోజు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బత్తినివానిపల్లి నుంచి ప్రారంభమైన యాత్రలో అడుగడుగునా ఇరుగు పొరుగు నియోజకవర్గాల నుంచి అధికార పార్టీ నాయకులు వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురిచేస్తున్నారో వివరించే ప్రయత్నం చేశారు. శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, అంబాల గ్రామాల వరకు పాదయాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టబోతోన్న దళిత బంధు పథకంపై విమర్శలు గుప్పించారు. తన రాజీనామా వల్లే దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీతో పాటు దళితులకు మూడెకరాల భూమి హామీనీ కేసీఆర్ అమలు చేయలేదని విమర్శించారు. ఇప్పుడు ఓట్లను కొల్లగొట్టడానికి ఈ కొత్త పథకం తీసుకొస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇస్తారో.. ఎన్నికల తర్వాత ఎలా మర్చిపోతారో ప్రజలు గమనించాలని కోరారు.
ఎండనక, వాననక పాదయాత్రను కొనసాగిస్తున్న ఈటల ప్రజలతో కలిసే భోజనం చేస్తున్నారు. సోమవారం రాత్రి అంబాలలో బస చేసిన ఈటల.. ఇవాళ గూడూరు, నేరెళ్ల, లక్ష్మీపూర్, కాశింపల్లి, పగిడిపల్లి మీదుగా పాదయాత్రను కొనసాగించనున్నారు. రాత్రికి వంగపల్లిలో బస చేయనున్నారు.
ఈటల రాజేందర్ వెంట హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జీ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, బొడిగ శోభ, ప్రేమేందర్ రెడ్డి, యెండల లక్ష్మి నారాయణ, ధర్మారావు, శ్రీశైలం గౌడ్, చాడ సురేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
బత్తినివానిపల్లి నుంచి మొదలైన యాత్ర..
కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి ప్రజా దీవెన యాత్రను మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో సతీమణి జమునతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పాదయాత్ర ద్వారా ఆయా గ్రామస్థులను నేరుగా కలుసుకున్న ఈటల పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. బత్తినివానిపల్లి నుంచి ప్రారంభమైన ఈటల ప్రజా దీవెన యాత్ర... 127 గ్రామాల మీదుగా 23 రోజుల పాటు కొనసాగనుంది.
ప్రజా దీవెన యాత్రకు అండగా ఉండేందుకు అనేక వర్గాల ప్రజలు, అన్ని యూనివర్శిటీలు విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చారని ఈటల తెలిపారు. ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిసేలా సాగుతోన్న ఈ పాదయాత్రలో.. ప్రజలందరూ నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. తాము ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదన్న ఈటల... ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నామని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం హుజురాబాద్ నుంచే మొదలవుతుందని ఈటల స్పష్టం చేశారు.