కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో యాసంగి వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే కూలీల కొరత అన్నదాతలకు శాపంగా మారింది. రబీ సీజన్ ప్రారంభ దశలో రోజువారీ కూలీ రూ.300 ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.600కు చేరింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అన్నదాతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ నుంచి వలస కూలీలను తీసుకొచ్చి నాట్లు వేయిస్తున్నారు. తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంటలో దాదాపు 17 మంది పురుషులు నాట్లు వేస్తుండగా స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
ఎకరా పొలాన్ని కేవలం గంటలో చాకచక్యంగా నాటు వేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎకరం నాటు వేసేందుకు సుమారు రూ.4 వేల తీసుకుంటున్నారని రైతులు అంటున్నారు. నాటు వేసే విధానం యంత్ర పరికరాలు వినియోగించి చేసినట్లుగా అందరినీ ఆకర్షిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎటుచూసినా పొలాలు నాటుకు సిద్ధంగా ఉన్నాయి. బిహారీ కూలీలు నాట్లు బాగా వేస్తున్నారని రైతులు తెలిపారు. ఇది ఆర్థికంగా వారికి కూడా కలిసి వచ్చేలా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.