వర్షాలకు చెరువులు, కుంటలు, కాల్వల ఆనకట్టలు, రహదారులు తెగిపోయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం నవాబుపేటలో జిల్లా భాజపా సమన్వయకర్త రాంగోపాల్‌రెడ్డితో కలిసి బండి సంజయ్ పర్యటించారు. సీతారాంపూర్ వద్ద తోటపల్లి కాలువకు గండితో పాటు నవాబుపేటలో వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించారు.
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నా.. సీఎం ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ నిలదీశారు. ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు, చెరువులు తెగి.. పంట పొలాలు మునిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదని ఆరోపించారు. సమీక్షల పేరుతో.. సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
వర్షాలతో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్పందించకపోతే భాజపా ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తామని.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అనంతరం మండల భాజపా నాయకుడు బోయిని వంశీ కృష్ణ ఇంట్లో భోజనం చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు దుడ్డెల లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా నాయకులు దొరిశేట్టి సంపత్ తదితరులున్నారు.
ఇవీచూడండి: ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ తయారుకావాలి: కేసీఆర్