కామారెడ్డి జిల్లాలో కరోనా కట్టడిలో భాగంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి, బాన్సువాడ పట్టణంలో మూడు ప్రాంతాలను కరోనా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 14 రోజులుగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనడం వల్ల వాటిని ఆరెంజ్ జోన్లుగా ప్రకటించారు. అక్కడ మరో 14 రోజుల పాటు పాజిటివ్ కేసులు నమోదు కాకుంటే గ్రీన్‌జోన్లు పరిధిలోకి తెస్తారు.
ముగిసిన క్వారంటైన్ గడువు...
విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి 28 రోజుల క్వారంటైన్ గడువు ముగిసింది. భిక్కనూరు దక్షిణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రంలోని 15 మందికి కరోనా లక్షణాలు లేకపోవడం వల్ల వారందరినీ ఇళ్లకు పంపించి కేంద్రాన్ని ఖాళీ చేశారు.
● దేవునిపల్లిలో 28 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం వల్ల గ్రీన్‌జోన్‌గా ప్రకటించారు.
● కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాకుంటే మదీనా కాలనీని ఈ నెల 30న, టీచర్స్ కాలనీని మే 1న, అరాఫత్ కాలనీని మే 9న గ్రీన్ జోన్‌గా ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం జిల్లాను కరోనా రహిత జిల్లాగా ప్రకటించే అవకాశం ఉంది.
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి...
జిల్లాలో కరోనా వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. అయినా పౌరులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగకుండా జాగ్రత్త పడాలన్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి. శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలని చెప్పారు.