Solar Village in Telangana: విద్యుత్ ఛార్జీల బాదుడు నుంచి తప్పించుకోవడానికి.. ఆ గ్రామ మహిళలు సౌరవిద్యుత్తును అంది పుచ్చుకున్నారు. తమ అవసరాలకు వినియోగించుకున్న తర్వాత.. మిగిరిన సౌరవిద్యుత్తును ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. శ్రీనిధి ద్వారా లోన్ తీసుకుని సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న గ్రామస్థులు.. ఇతర పల్లెలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ గ్రామం.. సౌరవిద్యుత్ వెలుగులతో విరాజిల్లుతోంది. గ్రామ సర్పంచ్ రాంబాబు ఆలోచన, మహిళ సంఘం సభ్యుల ముందడుగుతో.. విజయాన్ని అందుకున్నారు. గ్రామంలోని మహిళలు 'శ్రీనిధి పొదుపు సంఘం' బ్యాంకు ద్వారా అప్పు తీసుకుని.. సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో తొలుత 11 కుటుంబాలు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోగా.. ఇప్పుడు దాదాపుగా ఊరంతా విస్తరించింది.
అంకోలు క్యాంప్ గ్రామంలో సోలార్ విద్యుత్ వెలుగులు చూసి.. చుట్టుపక్కల ఊరి వాళ్లు కూడా ఇదేబాటలో నడుస్తున్నారు. సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతి నెలా 8 యూనిట్ల నుంచి 240 యూనిట్లు వాడుకోవచ్చు. గృహ వినియోగానికి పోగా.. మిగిలిన కరెంటును ప్రభుత్వానికే విక్రయిస్తున్నారు. సౌరవిద్యుత్ వల్ల అధిక విద్యుత్ ఛార్జీల బాధ తప్పిందని మహిళలు చెబుతున్నారు. సుమారు లక్షా 50 వేల రూపాయల ఖర్చుతో సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో విద్యుత్ బిల్లు గరిష్ఠంగా రెండు వేల వరకు వచ్చాయని.. ఇప్పుడు ఆ బాధ తప్పిందని చెబుతున్నారు.
"మా గ్రామం సోలార్ వైపు అడుగులు వేయడం జరిగింది. 11 కుటుంబాలు 3కేవీఏ, మూడు కుటుంబాలు 2కేవీఏ సోలార్ పవర్ ప్లాంట్లను ఇంటి పై కప్పులపై బిగించుకున్నాము. ఎవరైతే రూ.1000పైన విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నారో.. వాళ్లను మొదటి ఫేజ్‌గా తీసుకున్నాము. ఒక ఏడాది తర్వాత దీని వాడకం ఉపయోగాన్ని అందరూ తెలుసుకుని.. ఈ రోజు గ్రామంలో ఇంకో 40 మంది ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మేము విద్యుత్ సంస్థలకు ఎక్కువగా కరెంట్‌ను పంపిస్తే వారు రూ. 4లను యూనిట్‌కు చెల్లిస్తున్నారు. మా గ్రామం నుంచి 1500 యూనిట్లు కరెంట్‌ను గ్రిడ్‌కు పంపించడం జరిగింది. అందుకు సంబంధించిన డబ్బులు మాకు వస్తాయి." - రాంబాబు, గ్రామ సర్పంచ్
"మాకు కరెంటు బిల్లు రూ. 2000లకు పైనే వచ్చేది. ఈ సోలార్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత మినిమమ్ ఛార్జీ వస్తుంది. ఎక్కువగా వాడినా సరే.. కరెంటు మిగిలి దానిని విద్యుత్ సంస్థకు విక్రయించడం జరుగుతుంది. సోలార్‌ను లక్ష రూపాయలను శ్రీనిధి లోన్ ద్వారా తీసుకున్నాము." - అనిత, గ్రామస్థురాలు
ఇవీ చదవండి: