కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల్లో తడి, పొడి చెత్త సేకరణకు పంపిణీ చేసిన బుట్టలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. పాలిథిన్ సంచులు, ఇతర వ్యర్థాలు కనిపించినా వెంటనే బుట్టలో వేస్తున్నారు. పురపాలిక ఆటోలు ఇళ్ల ముందుకు రాగానే జనం ఇంటి గడపదాటి చెత్తను అందిస్తున్నారు. సేకరించిన వ్యర్థాలను డంపింగ్‌యార్డులో వేరు చేసి కంపోస్ట్ ఎరువు తయారీకి సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
విస్తృత ప్రచారంతోనే
ఆయా వార్డుల్లో పురపాలిక తరపున విస్తృత ప్రచారంతోనే మార్పు కనిపిస్తోంది. జనాలు, వ్యాపారులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా ..అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఎక్కడైనా చెత్త కనిపిస్తే కఠిన చర్యలు చేపడుతున్నారు. సుభాష్‌రోడ్డు, డెయిలీమార్కెట్, జేపీఎన్ రోడ్డు, నిజాంసాగర్ రోడ్డు, అశోక్‌నగర్ రోడ్డు ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రధాన వాణిజ్య ప్రాంతాలన్నీ ఇక్కడే ఏర్పాటయ్యాయి. దీంతో డబ్బాలు, ఇతర వ్యర్థాలను సేకరించి పురపాలిక సిబ్బందికి అందజేస్తున్నారు.
కాల్వల్లో పేరుకుపోకుండా చర్యలు
పాలిథిన్ సంచులు, చెత్తా చెదారంతో కాల్వలో నీరు పారేందుకు వీలయ్యేది కాదు. ఎక్కడి వారక్కడ ఇంటి ఆవరణలో, దుకాణాల ఎదుట కాల్వలో చెత్తను పారేయడంతో సమస్య ఉత్పన్నమైంది. వానాకాలంలో వ్యర్థాలు పేరుకుపోయి వరద నీరు సునాయసంగా పారేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం నిత్యం ఇంటి చెంతకే పురపాలక సిబ్బంది వచ్చి చెత్తను తీసుకెళ్తున్నారు.
ప్రజల్లో చైతన్యం అవసరం
పారిశుద్ధ్యం విషయంలో ప్రజల్లో మార్పు అవసరం. ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను పురపాలక సిబ్బందికి అప్పగించాలి. కాల్వల్లో పారేస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సిబ్బందికి ఇవ్వడం ద్వారా డంపింగ్ యార్డులో సమస్యలేమీ రావు. సమష్టి కృషితోనే స్వచ్ఛ కామారెడ్డి దిశగా కృషి చేద్దాం.
- నిట్టు జాహ్నవి, మున్సిపల్ ఛైర్‌పర్సన్-కామారెడ్డి
వేరుగా ఇవ్వాలి
గతంలో ప్రజలకు అందజేసిన చెత్త బుట్టల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సిబ్బందికి ఇవ్వాలి. ఇంటింటా చెత్త సేకరణ విషయంలో మార్పులు తెచ్చాం. ప్రతి వార్డుల్లో పారిశుద్ధ్య సిబ్బందిని, జవాన్లను సమన్వయం చేస్తున్నాం. గైర్హాజరయ్యే కార్మికుల విషయంలో చర్యలు తీసుకుంటాం. మార్పులను ఆహ్వానించాల్సిన ఆవశ్యకత ఉంది.
- దేవేందర్, కమిషనర్