కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ శరత్‌కుమార్ పాల్గొన్నారు. సమీక్షలో ఎజెండా ప్రకారం వివిధ అంశాలపై మంత్రి చర్చించారు.
రాష్ట్రంలోనే మొట్టమొదటిగా రైతు వేదికల భవనాలను పూర్తి చేయడం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యుత్ ముసాయిదా బిల్లు, రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 120 కోట్లు మంజూరయ్యాయని మంత్రి వివరించారు.
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. విద్యుత్ బిల్లు ద్వారా రైతుల వ్యవసాయ పొలాల వద్ద మీటర్లు బిగించి రైతుల నడ్డి విరిచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వముందని అన్నారు. ఈ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని.. వెంటనే ఈ విధానాలకు స్వస్తి చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: మంజీరా నదిలో చిక్కుకున్న ఐదుగురు.. రక్షించాలంటూ వినతి