Minister KTR fire on central government: కామారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. అనంతరం పిట్లం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ముదిరాజ్‌లు, గంగపుత్రులకు రూ.వెయ్యి కోట్లతో మోపెడ్‌లు ఇచ్చామని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేసింది కేసీఆర్ సర్కార్ అని మంత్రి పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలను కేసీఆర్ సర్కార్ నెలకొల్పిందని గుర్తు చేశారు. విదేశాల్లో చదువుకునే వారికి రూ.20 లక్షల ఆర్థికసాయం చేస్తున్నామని తెలిపారు. గిరిజన రిజర్వేషన్లను 6శాతం నుంచి 10శాతానికి తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఈ సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు.
KTR fire on Prime Minister Modi: 10 సార్లు అవకాశాలు పొంది, 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ అప్పుడు ఏం చేసిందని ఆరోపించారు. 50 ఏళ్లల్లో ఏమీ చేయని నాయకులకు మళ్లీ ఎందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. కులవృత్తులను పోత్సహించడం రానివారికి మరల అధికారం ఇవ్వాలా అని విమర్శించారు. ప్రధాని మోదీపై తనదైన శైలీలో విరుచుకుపడిన కేటీఆర్ "మన దేశంలో అద్భుతమైన నటుడు ప్రధాని మోదీ.. ప్రతిపాదనలు పంపితే మోదీకి ఆస్కార్‌లో ఉత్తమ నటుడు అవార్డు వచ్చేదని" ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీకి, ఈడీకి భయపడేది లేదని పేర్కొన్న ఆయన.. ప్రజాకోర్టులో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
"మనదేశంలో అద్భుతమైన నటుడు ప్రధాని మోదీ. ప్రతిపాదనలు పంపితే మోదీకి ఆస్కార్‌లో ఉత్తమ నటుడు అవార్డు వచ్చేది. దేశ సంపదనంతా మిత్రుడు అదానీకి దోచిపెడుతున్నారు. ఆయన నుంచి తన పార్టీకి చందాలు తీసుకుంటున్నారు. మోదీ, ఈడీకి భయపడేది లేదు. ప్రజాకోర్టులో తేల్చుకుందాం."- కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కవితపై మోదీ సర్కార్ కక్ష కట్టిందని పేర్కొన్నారు. రాజకీయ కక్షతో నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజం కవితకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మోదీ పాలనకు చరమగీతం పాడాలని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
అంతకు ముందు జుక్కల్ నియోజకవర్గంలో పలుఅభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. నిజాంసాగర్ మండలం గోర్గల్ వద్ద మంజీరా నదిపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవం అనంతరం, జక్కాపూర్ వద్ద నాగమడుగు ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కేటీఆర్ పర్యటన దృష్ట్యా జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి:
ఈడీ నోటీసులపై సుప్రీంను ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత
నిందితులను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయడమేంటి : బండి సంజయ్