తెల్లకాగితాలపై ఒప్పందాలు చేసుకొని భూములు కొనుగోలు చేశారు. కళ్లముందే భూమి ఉన్నా పట్టా హక్కులు లేవు. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, బీమా పథకాలకు దూరం అవుతున్నారు. బ్యాంకులకు వెళ్తే రుణం ఇవ్వడం లేదు. ఇలాంటి భూములను క్రమబద్ధీకరించాలని తొలిసారిగా 2016లో నిర్ణయం తీసుకొన్నారు. అప్పట్లో వేలాది మంది లబ్ధిపొందారు. తాజాగా మళ్లీ ఈ అంశాన్ని తీసుకొచ్చారు. 2014 జూన్ 2 నాటికి ముందు కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి.
తహసీల్దార్ పేరుతో దరఖాస్తులు
తహసీల్దార్ పేరు మీద దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మీ సేవ కేంద్రంలో అప్‌లోడ్ చేయాలి. పట్టాదారు పాసుపుస్తకం ఉంటే ఆ వివరాలు పొందుపరచాలి. భూమికి హద్దులు నమోదు చేయాల్సి ఉంటుంది.
పకడ్బందీగా పరిశీలించిన తర్వాతే
ఐదెకరాలకు మించని వ్యవసాయ భూములను ఉచితంగా తహసీల్దార్ కార్యాలయంలో పట్టా మార్పిడి చేస్తారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకోరు.
ఫారం-10 క్లైయిమ్స్ స్వీకరించి తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాసుపుస్తకాల చట్టం 1971లోని నిబంధన 22(2),సెక్షన్ 5(ఏ) ప్రకారం భూమిని క్రమబద్ధీకరిస్తారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వాటికి ఆమోద ముద్ర వేసి 14బి ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.
వచ్చిన వాటిని వడబోసి సాదాబైనామా క్రయవిక్రయాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు.
మీసేవ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల వడబోత చేపట్టనున్నారు. క్షేత్ర స్థాయిలో ఆర్‌ఐ(గిర్దావర్) వెళ్లనున్నారు. కొనుగోలు చేసిన కాగితం వాస్తవమేనని పరిశీలిస్తారు.
ఒక వేళ పట్టాదారు కుటుంబ సభ్యులు, బంధువులు అభ్యంతరం తెలిపితే, హద్దుల రైతుల వాంగ్మూలం తీసుకుంటారు.
అనంతరం ఫారం-8 నోటీసులు జారీ చేసి గ్రామపంచాయతీల్లో నోటీసులు అంటించనున్నారు. వీటిపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
వీటిపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలు తేల్చనున్నారు.
గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూములకే వర్తింపు
కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల పట్టా హక్కుల మార్పిడికి మాత్రమే వర్తిస్తుంది. అటవీ, అసైన్డ్, సీలింగ్ భూములకు యజమాన్య హక్కుల మార్పిడిని అనుమతించరు. కేవలం పట్టా భూముల్లో సవ్యంగా ఉన్న క్రయ, విక్రయ లావాదేవీలను మాత్రమే క్రమబద్ధీకరించనున్నారు.
అపరిష్కృత సమస్యలే అధికం
భూ సమస్యలు పలు రకాల కారణాలతో పరిష్కారానికి నోచుకోవడంలేదు. తాతల నాటి నుంచి సాగులో ఉన్న భూములకు పట్టాలు రాకపోవడంతో రైతుబంధు పెట్టుబడి సాయం, పంట రుణాలు పొందే అవకాశాలను కోల్పోతున్నారు.
దరఖాస్తుల పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. విస్తీర్ణంలో వ్యత్యాసం, రెండేసి ఖాతాలు, వాస్తవంగా భూములు అమ్మినప్పటికీ పట్టాదారుల వారసులు అడ్డుకోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయి.
కొన్ని చోట్ల పట్టాదారులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉండటంతో అపరిష్కృతంగానే దర్శనమిస్తున్నాయి.