Kamareddy Farmers Complain to HRC : కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాస్టర్ ప్లాన్ వివాదంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా మాస్టర్ ప్లాన్‌ను మారుస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ రైతలు నాయకులను నమ్మడం లేదు. ఇందులో భాగంగానే బాధిత రైతులంతా హైకోర్టును కూడా ఆశ్రయించారు.
Kamareddy master Plan issue update : అయితే తాజాగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు రాష్ట్ర హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. కామారెడ్డి కలెక్టర్, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాస్టర్ ప్లాన్ వ్యతిరేక నిరసనల్లో లాఠీఛార్జ్ చేశారని ఫిర్యాదు చేశారు. రైతులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఈ ప్రభుత్వం లాఠీతో అణిచివేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. తమకు పోలీసులు, కోర్టుల్లో న్యాయం జరిగేలా లేదని.. అందుకే హెచ్‌ఆర్సీని ఆశ్రయించినట్లు వెల్లడించారు.
అయితే ఈనెల 11న బాధిత రైతుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏం కాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ల విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని.. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కి హైకోర్టు వాయిదా వేసింది.
మరోవైపు ఇప్పటికే ఈ వివాదంపై స్పందించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రైతులకు భరోసానిచ్చారు. మాస్టర్‌ప్లాన్‌లో రైతుల భూములుపోవంటూ హామీ ఇచ్చారు. ఓ వైపు వీరి ప్రకటనను స్వాగతిస్తూనే.. అప్పుడే ఆందోళన ఆపేది లేదని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో భూములను కోల్పోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి జీవో వచ్చేంతవరకు.. ఉద్యమం వీడబోమని రైతు ఐకాస నాయకులు స్పష్టం చేశారు. అధికారిక ప్రకటన కోసం కర్షకులకు మద్దతుగా.. పదవులకు కొందరు రాజీనామాలు చేస్తున్నట్టు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటించారు.
అసలు ఈ మాస్టర్ ప్లాన్ గొడవ ఏంటంటే..? రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ బృహత్ ప్రణాళికను దిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించి.. ఆ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు.
2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలతో 8.5 శాతం ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే.. అడ్లూర్, ఇల్సిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి రైతులకు చెందిన 900 ఎకరాల భూములను చూపారు. దీనివల్ల ఈ భూములు రెసిడెన్షియల్ కింద పనికిరావని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఈ భూములకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణం కూడా కష్టమవుతుందని భావించిన రైతులు ఆందోళనబాట పట్టారు.