పట్టణాలతో పాటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారు ఉపాధి పనులకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తమకు జాబ్‌కార్డులు మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. అడిగిన ప్రతిఒక్కరికి అందించే విధంగా చర్యలు చేపడితే కష్టకాలంలో కూలీలకు ఆసరా లభిస్తుంది. ఇదే విధంగా రెండుమూడేళ్లుగా వినియోగించని జాబ్‌కార్డులను క్రియాశీలంగా మార్చాలని అధికారులకు విన్నవిస్తున్నా మండలాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరో నెల రోజులు పనులు కొనసాగేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని కూలీలు కోరుతున్నారు.
మస్టర్ల నమోదులో జాప్యం...
కూలీల హాజరును నమోదు చేయడమే కాకుండా... వారు చేసిన పనిని కొలిచేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. మస్టర్ల నమోదులో జాప్యం కారణంగా కొన్ని ప్రాంతాల్లో వారంలో రెండు రోజులు పనులు నిలిపివేస్తున్నారు.
కొరవడిన జాగ్రత్తలు...
కూలీలు సామాజిక దూరం పాటించేలా చూడడంతోపాటు పనులను దూరంగా గుర్తించాలని నిబంధనలున్నా... క్షేత్రస్థాయి సిబ్బంది పనిఒత్తిడితో పట్టించుకోవడం లేదు. కూలీలందరికి మాస్కులు పంపిణీ చేయాల్సిన ఉన్నా నామమాత్రంగా అందిస్తున్నారు.
నిబంధనల మేరకు పనులు...
పని ప్రదేశాల్లో కూలీలు నిబంధనలు పాటించాలన్నారు కామారెడ్డి గ్రామీణాభివృద్ధి అధికారి చంద్రమోహన్‌రెడ్డి. మాస్కు ధరించడమే కాకుండా... సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో తాగునీరు వెంట తెచ్చుకోవాలన్నారు. కొత్త జాబ్‌కార్డు కావాలన్నా, పాత వాటిని క్రియాశీలంగా మార్చాలన్నా ఎంపీడీవోకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.