కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేశారు. పంట చేతికందే సమయంలో అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా అమలు చేసి ఉంటే రైతన్నలకు మేలు కలిగేదన్నారు.
జిల్లాలో పత్తి, సోయా, చెరకు, వరి, కూరగాయలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మొక్కజొన్న పంటను ఎందుకు కోనుగోలు చేయటంలేదని ప్రశ్నించారు. జిల్లావ్యాప్తంగా మక్కలు ప్రధాన పంట అయినప్పటికీ ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే రైతు ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.