తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని స్థానిక సీఐ రామ కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
రాష్ట్రంలో పోలీస్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్ల క్రితం నియోజకవర్గంలో దాదాపు 800 మంది యువతకు తన సొంత నిధులతో ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. కోచింగ్ కేంద్రాల్లో భోజనాలు ఏర్పాటు చేసి.. 150 మందికి ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను అందజేశారు.
పరీక్ష మాత్రమే కాకుండా.. పోలీసు శిక్షణకు ఫిజికల్ ట్రైనింగ్ కూడా చాలా ముఖ్యమని గుర్తుచేశారు. కష్టపడి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్, కామారెడ్డి రైతు బంధు సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీపీ వెంకట్ రాం రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బాలక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బ్లేడ్‌బ్యాచ్ వీరంగం: కారు ఆపిమరీ బ్లేడ్‌తో కోసేశాడు!