కామారెడ్డి జిల్లాలోని వ్యవసాయ విస్తరణాధికారులకు మిడతలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వానాకాలం పంటల అవగాహన సదస్సులు పూర్తయిన తదనంతరం విడతల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా సరిహద్దు గ్రామాల్లోని రైతులకూ అవగాహన కల్పించనున్నారు. మిడతల దండు పొలాల్లోకి ప్రవేశించకుండా దుక్కిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి కర్షకులకు వివరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
గతేడాది వచ్చినవి ఎడారి మిడతలే
గత వానాకాలం పంట కాలం చివరలో బీబీపేట మండలంలోని తుజాల్‌పూర్, షేర్‌బీబీపేట గ్రామల్లో మిడతలు ప్రవేశించి పచ్చని పైరును నాశనం చేశాయి. రుద్రూర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆయా పంట పొలాలను పరిశీలించి ఎడారి మిడతలుగా ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించి మిడతల గుడ్లు ఏమైనా ఉంటే గుర్తించాలని క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులను జిల్లా పాలనాధికారి ఆదేశించారు. చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల మేర పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని నిర్దేశించారు.
దుక్కుల సమయంలోనే నివారణ చర్యలు
*మిడతలు రాకుండా దుక్కుల సమయంలోనే జాగ్రత్తలు తీసుకొంటే మేలని వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతలకు సూచిస్తున్నారు.
* ప్రధానంగా పంటపొలాల్లో గట్లమీద గడ్డిని కాల్చివేయడం మేలంటున్నారు.
*పాలిడాల్ పౌడర్ లేదా క్లోరోఫైరీపాస్ పౌడర్‌ను ఎకరాకు పది కిలోల నుంచి 25 కిలోలు చల్లితే ఆ వాసనకు మిడతలు రాకుండా ఉండే అవకాశం ఉందన్నారు.
* మిడతల ఆనవాళ్లు కనిపిస్తే క్లోరోఫైరీపాస్ ద్రావణాన్ని పిచికారీ చేయడంతో పాటు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.