ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూనే.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. చట్టంలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కొత్త చట్టంలో కౌలు రైతుల ఊసేలేదన్న తమ్మినేని.. గతంలో ఆర్టికల్ 26 ద్వారా భూ జయమానులతో పాటు కౌలు రైతులకు కూడా పత్రాలు ఇచ్చేవారని తెలిపారు. ప్రస్తుత చట్టంతో కౌలు రైతులు ఈ హక్కు కోల్పోతున్నారని, రైతు బంధు సమయంలోనూ.. కౌలు రైతులను గుర్తించలేదని మండిపడ్డారు.
గత కొద్దికాలంగా రెవెన్యూ సంస్కరణలు తెస్తామంటూ సీఎం కేసీఆర్ ఊదరగొడుతూ వచ్చారని ఎద్దేవా చేసిన తమ్మినేని.. నూతన చట్టంలో.. రెవెన్యూ లోపాలు, కుంభకోణాల జోలికి వెళ్లలేదని దుయ్యబట్టారు. ఆలయ భూములు, వక్ఫ్ భూములు, మిగులు భూములు, అటవీ భూములు లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని విమర్శించారు. వీటిని బయటకు తెచ్చేలా సమగ్ర సర్వే జరగాలని డిమాండ్ చేశారు.
అవినీతి, అక్రమ అధికారులు ఉంటే వారిపై దావా వేయడానికి రైతులు కోర్టుకు వెళ్లే అవకాశాన్ని ఈ చట్టం తీసేసిందన్నారు. ఎల్ఆర్ఎస్ జీవో 111 ప్రకారం అక్రమార్కుల జోలికి వెళ్లడం లేదని, ఎకరాల కొద్ది ఆక్రమించిన వారిని వదిలి చిన్న చిన్న ప్లాట్లను చేసుకున్న వారి జోలికి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : కొత్త రెవెన్యూ చట్టం అమలు.. సత్ఫలితాలిస్తున్నరిజిస్ట్రేషన్ల ప్రక్రియ!