కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం తిప్పపూర్ గ్రామానికి చెందిన శ్రీగాధ సిద్ధరామేశ్వర్ ఇల్లు శుక్రవారం నేలమట్టమైంది. అతని కుటుంబం వీధిన పడింది. రోజూ 17కి.మీలు ప్రయాణం చేసి కుట్టుమిషన్ తొక్కుతూ అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రామేశ్వర్‌కు ఆ ఇల్లే ఆధారం. గ్రామంలో పారిశుద్ధ్య పనుల పేరుతో ఒక గుత్తేదారు మురికికాలువల నూతన నిర్మాణం చేపట్టారు.
ఈ క్రమంలో జేసీబీతో కాలువలు తీయించారు. కాలువలు తీయించి కొన్ని నెలలు గడుస్తున్నా వారు పట్టించుకోలేదు. దీంతో గ్రామంలో నుంచి వచ్చే మురుగు నీరు కాలువల్లో చేరింది. ఆ నీటి తేమ.. పక్కనే ఉన్న సిద్ధరామేశ్వర్ ఇంటి గోడలకు పట్టి ఒక్కసారిగా ఇల్లు కూలిపోయింది. అప్రమత్తమైన కుటుంబీకులు బయటకు పరుగులు తీశారు. ఇంటిని కోల్పోయిన బాధితుడు తమకు ఇల్లు కట్టిస్తే చాలని అధికారులను వేడుకున్నాడు.
ఇదీ చదవండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొరాయిస్తున్న సర్వర్లు