జోగులాంబ జిల్లా వ్యవసాయానికి, ముఖ్యంగా విత్తన పత్తి సాగుకు పెట్టింది పేరు. ఆగస్టులో పనులు ఊపందుకుంటాయి. కూలీల కొరతతో తల్లిదండ్రులే పిల్లలను బడి మాన్పించి పనులకు తీసుకెళ్తారు. ఇలా రెండు నెలలు చదువుకు దూరమైన పిల్లల్లో అత్యధికులు మళ్లీ బడి ముఖం చూడటం లేదు. ఫలితంగా విద్యలోనే కాదు అభివృద్ధిలోనూ జిల్లా వెనుకబడుతోంది. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు పోలీసు శాఖ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టింది.
జోగులాంబ గద్వాల జిల్లా విత్తన పత్తితోపాటు బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, నిరక్షరాస్యతకు కూడా చిరునామాగా మారింది. ఈ సమస్యల పరిష్కారానికి విద్యాశాఖతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు చాలా ప్రయత్నాలే చేస్తున్నాయి. మార్పు మాత్రం పెద్దగా కనిపించటం లేదు. ఏటా బడిబయట ఉన్న పిల్లల సంఖ్య వేలల్లోనే ఉంటోంది. ఐకేపీ సిబ్బంది, విద్యాశాఖలు నిర్వహించిన సర్వేలోనే జిల్లాలో 2,180 మంది బడిబయట ఉన్నట్లు గుర్తించారు. ఎంవీ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో ఇందుకు రెండింతల మంది పిల్లలు బడిబయటే ఉన్నట్లు తేలింది.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో అయిదు రోజుల పాటు నిర్వహించిన బడిబాటలో ఉపాధ్యాయులు బడిబయట ఉన్న పిల్లలు 179 మాత్రమే చేర్చుకోగలిగారు. ఇప్పుడు పోలీసు శాఖ ఆపరేషన్ ముస్కాన్ చేపట్టింది. దీనిపై మంగళవారం జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ అపూర్వారావు ప్రత్యేక బృందాలతో చేయాల్సిన కృషిపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమమైనా పకడ్బందీగా అమలు చేస్తే బడిబయట పిల్లలందరూ మళ్లీ చదువుబాట పట్టే అవకాశం ఉంటుంది. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు భరోసా దక్కుతుంది.
మూడు నెలలే కీలకం
ఆగస్టు మొదటివారం నుంచి అక్టోబర్ చివరివారం వరకు జిల్లాలో విత్తనపత్తి చేలల్లో పనులు ఎక్కువగా ఉంటాయి. విత్తన పత్తి సాగుకే 1.28 లక్షల మంది కూలీలు అవసరం. అంత పెద్దఎత్తున కూలీలు దొరకటం కష్టంగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను పిలిస్తే భారీగా వేతనం చెల్లించాల్సి రావటంతో రైతులు తమ పిల్లలతోనే పనులు చేయిస్తున్నారు. మూడు నెలల పాటు కొన్ని పాఠశాలల్లో 50 శాతానికి మించి విద్యార్థులు గైర్హాజరు అవుతారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
పనులకు వినియోగిస్తే కేసులే
ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా పోలీసుశాఖ ఏర్పాటుచేసిన బృందాల సభ్యులు గతేడాడి పొలాలు, హోటళ్లు, ఇతర దుకాణాల్లో పనులు చేస్తున్న చిన్నారులను గుర్తించి సంరక్షణా కేంద్రాలకు తరలించారు. యజమానులపై చర్యలు చేపట్టారు. అప్పట్లో జిల్లాలో 21కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈసారి ఇన్‌ఛార్జి ఎస్పీ అపూర్వారావు ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభించారు. పోలీసులు, మండల విద్యాశాఖ అధికారులు పొలాలబాట పట్టారు.
ఇదీ చూడండి : నీళ్లు రావడం లేదని మున్సిపల్ కార్యాలయానికి తాళం